Dosakaya Pappu : దోసకాయ పప్పు.. ఈ పప్పును ఇష్టపడని వారు ఉండరనే చెప్పవచ్చు. దోసకాయ పప్పు చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పును ఇష్టంగా తినే వారు కూడా చాలా మంది ఉంటారు. వేడి వేడి అన్నంలో నెయ్యితో కలిపి ఈ పప్పును తింటే తిన్నవాళ్లదరూ ఆహా అనాల్సిందే. దోసకాయ పప్పును తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. అలాగే వంటరాని వారు, బ్యాచిలర్స్ కూడా ఈ పప్పును సులభంగా తయారు చేసుకోవచ్చు. అందరికి నచ్చేలా మరింత రుచిగా ఈ దోసకాయ పప్పును ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
దోసకాయ పప్పు తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నానబెట్టిన కందిపప్పు – ఒక కప్పు, దోసకాయ – 1, పచ్చిమిర్చి – 6 లేదా తగినన్ని, ఉల్లిపాయ – 1, కరివేపాకు – ఒక రెమ్మ, ఉప్పు – తగినంత, ఎండుమిర్చి -2, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, తాళింపు దినుసులు -ఒక టేబుల్ స్పూన్, చింతపండు – ఒక రెమ్మ, పసుపు – అర టీ స్పూన్, నూనె – 2 టేబుల్ స్పూన్స్.
దోసకాయ పప్పు తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో కందిపప్పు, పచ్చిమిర్చి, దోసకాయ ముక్కలు, పసుపు వేసుకోవాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి మూత పెట్టి 3 నుండి 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత చింతపండు, ఉప్పు వేసి పప్పును మెత్తగా చేసుకోవాలి. పప్పు గట్టిగా ఉంటే మరికొన్ని నీటిని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు తాళింపుకు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వెల్లుల్లి రెబ్బలు, తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు ఎర్రగా వేగిన తరువాత పప్పును వేసి కలపాలి. దీనిని మరో 5 నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, దోశ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది.