Mutton Liver Fry : నాన్ వెజ్ ప్రియుల్లో చాలా మంది మటన్ అంటే ఎంతో ఇష్టంగా తింటారు. మటన్‌తో కూర, వేపుడు, బిర్యానీ వంటివి చేస్తుంటారు. ఇవి ఎంతో రుచిగా ఉంటాయి. అయితే మటన్ ను మాత్రమే కాక, తలకాయ, బోటి వంటివి కూడా చేసి తింటారు. ఇవి కూడా ఎంతో టేస్టీగా ఉంటాయి. ఇక మటన్ లివర్ ఫ్రై అంటే కొందరు ఇష్టపడతారు. అయితే దీన్ని ఒక పద్ధతి ప్రకారం చేస్తే మరింత రుచిగా ప్రిపేర్ చేయవచ్చు. కింద చెప్పిన విధంగా మటన్ లివర్ ఫ్రైని చేస్తే అందరూ ఇష్టంగా తింటారు. ఎంతో రుచిగా ఉంటుంది. దీన్ని చేయడం కూడా సులభమే. మటన్ లివర్ ఫ్రైని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
మటన్ లివర్ ఫ్రై తయారీకి కావల్సిన పదార్థాలు..
మటన్ లివర్ – పావు కిలో, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒకటిన్నర టీస్పూన్, ఉల్లిపాయ – 1, టమాటా – 1, పచ్చి మిర్చి – 1, నూనె – 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు – రుచికి సరిపడా, నీళ్లు – అర గ్లాస్, కొత్తిమీర తరుగు – పావు కప్పు, కారం – 2 టేబుల్ స్పూన్లు, పసుపు – పావు టీస్పూన్, గరం మసాలా – 1 టేబుల్ స్పూన్.
మటన్ లివర్ ఫ్రై ని తయారు చేసే విధానం..
ముందుగా ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటాలను ముక్కలుగా కట్ చేయాలి. లివర్‌ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి శుభ్రంగా కడిగి కుక్కర్ గిన్నెలో వేయాలి. దీంట్లో ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి ముక్కలు, ఒక టేబుల్ స్పూన్ ఆయిల్, ఉప్పు, అర గ్లాస్ నీళ్లు కలిపి మూత పెట్టాలి. ఆరు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. తరువాత స్టవ్‌పై పాన్ పెట్టి వేడెక్కాక నాలుగు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేయాలి. తరువాత ఉడికించిన లివర్ మిశ్రమం వేసి వేయించాలి. లివర్‌లో ఉన్న నీళ్లన్నీ అయిపోయి పొడిగా వేగిన తరువాత కారం, గరం మసాలా, పసుపు వేసి మరో 5 నిమిషాల పాటు వేగనివ్వాలి. తరువాత కొత్తిమీరతో గార్నిష్ చేస్తే మటన్ లివర్ ఫ్రై రెడీ అవుతుంది. దీన్ని నేరుగా అలాగే తినవచ్చు. లేదా అన్నంలో ఇతర కూరలతోనూ అంచుకు పెట్టుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు. ఎప్పుడూ చేసే ఫ్రైకి బదులుగా ఒక్కసారి ఇలా మటన్ లివర్ ఫ్రైని వెరైటీగా చేసుకుని తినండి. మళ్లీ మళ్లీ కావాలంటారు.