Natu Kodi Kura : నాటుకోడి కూర.. ఈ కూర రుచి గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. నాన్ వెజ్ ప్రియులు ఈ కూరను ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. నాటుకోడి కూరను తినడం వల్ల రుచితో పాటు మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. బాయిలర్ చికెన్ కంటే నాటుకోడి కూరే రుచిగా ఉంటుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పవచ్చు. ఈ నాటుకోడి కూరను ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. రుచిగా, ఘాటుగా, కారంగా ఉండేలా నాటుకోడి కూరను తెలంగాణా స్టైల్ లో ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు.. ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నాటుకోడి కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
అరగంట పాటు నీటిలో నానబెట్టిన ఎండుమిర్చి – 15 నుండి 20, తరిగిన టమాట – 1, వెల్లుల్లి రెబ్బలు – 12, నూనె – 1/3 కప్పు, సన్నగా పొడుగ్గా తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, పసుపు – పావు టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, నాటుకోడి చికెన్ – అరకిలో, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒక కప్పు, గరం మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

నాటుకోడి కూర తయారీ విధానం..
ముందుగా ఒక జార్ లో నానబెట్టిన ఎండుమిర్చి, టమాట ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కుక్కర్ లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత పసుపు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియాల పొడి వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ కూడా వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత చికెన్, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిపై సాధారణ మూతను ఉంచి 15 నిమిషాల పాటు వేయించాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు కుక్కర్ మూతను ఉంచి చిన్న మంటపై 5 విజిల్స్, పెద్ద మంటపై 2 విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి.
కోడి ముదురుగా ఉంటే మరో రెండు విజిల్స్ వచ్చే ఉడికించాలి. తరువాత మూత తీసి నీరంతా పోయే వరకు ఉడికించాలి. ఇలా ఉడికించిన తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలపాలి. దీనిని మరో రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నాటుకోడి కూర తయారవుతుంది. దీనిని అన్నం, బగారా అన్నం, చపాతీ, రోటీ, పుల్కా ఇలా దేనితో తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన నాటు కోడి కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.