Nimmakaya Nilva Pachadi : క‌చ్చితమైన కొల‌త‌ల‌తో నిమ్మ‌కాయ నిల్వ ప‌చ్చ‌డిని ఇలా పెట్టండి.. చాలా కాలం పాటు అలాగే ఉంటుంది..

Nimmakaya Nilva Pachadi : నిమ్మ‌కాయ‌లు.. ఇవి మ‌నంద‌రికి తెలిసిన‌వే. నిమ్మ‌కాయ‌లు మ‌న శ‌రీరానికి ఎంతో మేలు చేస్తాయ‌ని మ‌నంద‌రికి తెలుసు. నిమ్మ‌కాయ‌ల్లో మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాలు ఉంటాయి. నిమ్మ‌ర‌సాన్ని ఆహారంలో భాగంగా తీసుకోవ‌డం వ‌ల్ల అధిక బ‌రువు సమ‌స్య నుండి బ‌య‌ట ప‌డ‌వ‌చ్చు. జీర్ణ‌శ‌క్తిని మెరుగుప‌ర‌చ‌డంలో, బీపీ ని నియంత్రించ‌డంలో నిమ్మ‌ర‌సం మ‌న‌కు ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఈ నిమ్మ‌కాయ‌ల‌తో మ‌నం నిమ్మ‌కాయ పులిహోర, నిమ్మ‌కాయ ప‌చ్చ‌డి వంటి వాటిని కూడా తయారు చేస్తూ ఉంటాం. నిమ్మ‌కాయ‌ల‌తో చేసిన నిల్వ ప‌చ్చ‌డి చాలా రుచిగా ఉంటుంది. దీనిని త‌యారు చేయ‌డం కూడా చాలా సుల‌భం. నిమ్మ‌కాయ‌ల‌తో నిల్వ ప‌చ్చ‌డిని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

నిమ్మ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

దోర‌గా పండిన నిమ్మ‌కాయ‌లు – 10, ప‌సుపు – ఒక టీ స్పూన్, ఉప్పు – అర క‌ప్పు, నూనె – పావు క‌ప్పు, ఎండుమిర్చి – 4, క‌చ్చా ప‌చ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బ‌లు – 4, మెంతి గింజ‌లు – 10, జీల‌క‌ర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – అర‌టీ స్పూన్, జీల‌క‌ర్ర పొడి – 2 టీ స్పూన్, కారం – 3 టీ స్పూన్స్.

Nimmakaya Nilva Pachadi recipe in telugu perfect taste
Nimmakaya Nilva Pachadi

నిమ్మ‌కాయ నిల్వ ప‌చ్చ‌డి త‌యారీ విధానం..

ముందుగా నిమ్మ‌కాయ‌ల‌ను రెండు సార్లు బాగా క‌డిగి త‌డి లేకుండా తుడిచి ఆర‌బెట్టుకోవాలి. త‌రువాత ఈ నిమ్మ‌కాయ‌ల‌ను నిలువుగా క‌ట్ చేసి నాలుగు ముక్క‌లుగా చేసుకుని వాటిలోని విత్త‌నాల‌ను తీసివేయాలి. ఇలా క‌ట్ చేసిన నిమ్మ‌కాయ ముక్క‌ల‌ను ఒక గిన్నెలోకి తీసుకుని దానిలో ఉప్పు, ప‌సుపు వేసి బాగా క‌లపాలి. త‌రువాత వీటిని త‌డి లేని ఒక ప్లాస్టిక్ డ‌బ్బాలో లేదా గాజు సీసాలో వేసి మూత పెట్టి 10 రోజుల పాటు ఊర‌బెట్టాలి. ప‌ది రోజులు త‌రువాత ఈ నిమ్మ‌కాయ ముక్క‌ల‌ను బాగా క‌లిపి దీని నుండి త‌గిన‌న్ని ముక్క‌ల‌ను తీసుకుని మిగిలిన ముక్క‌ల‌ను ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇప్పుడు బ‌య‌ట‌కు తీసుకున్న ఈ నిమ్మ‌కాయ ముక్క‌ల‌ను తాళింపు చేసుకోవాలి. ఇందుకోసం ఒక క‌ళాయిలో నూనె వేసి వేడి చేయాలి.

నూనె వేడ‌య్యాక ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. త‌రువాత వెల్లుల్లి రెబ్బ‌లు, మెంతులు, జీల‌క‌ర్ర‌, ఆవాలు వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన త‌రువాత స్ట‌వ్ ఆఫ్ చేసి క‌ళాయిని ప‌క్క‌కు దించుకోవాలి. త‌రువాత ఈ నూనెలో పావు టీ స్పూన్ ప‌సుపు, కారం, జీల‌క‌ర్ర పొడి, ఒక టీ స్పూన్ ఉప్పు వేసి క‌లుపుకోవాలి. త‌రువాత దీనిలో ఊర‌బెట్టుకున్న నిమ్మ‌కాయ ముక్క‌ల‌ను వేసి క‌ల‌పాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల ఎంతో రుచిగా ఉండే నిమ్మ‌కాయ ప‌చ్చ‌డి త‌యార‌వుతుంది. దీనిని వేడి వేడి అన్నంలో వేసి క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా నిమ్మ‌కాయ ప‌చ్చ‌డిని త‌యారు చేసుకుని తిన‌డం వ‌ల్ల రుచితో పాటు ఆరోగ్య ప్ర‌యోజ‌నాల‌ను కూడా పొంద‌వ‌చ్చు.

Share
D

Recent Posts