Nuvvula Chikki : క్యాల్షియం ఎక్కువగా ఆహారాల్లో నువ్వులు కూడా ఒకటి. నువ్వులను మనం వంటల్లో విరివిగా వాడుతూ ఉంటాము. నువ్వులను ఆహారంగా తీసుకోవడం వల్ల ఎముకలు ధృడంగా తయారవుతాయి. రక్తహీనత సమస్య తగ్గుతుంది. చర్మం మరియు జుట్టు ఆరోగ్యం మెరుగుపడుతుంది. శరీరానికి కావల్సిన పోషకాలు అందుతాయి. పిల్లలకు నువ్వులను ఆహారంలో భాగంగా ఇవ్వడం వల్ల వారిలో ఎదుగుదల చక్కగా ఉంటుంది.
వంటల్లో వాడడంతో పాటు నువ్వులతో మనం ఎంతో రుచిగా ఉండే నువ్వుల చిక్కీని కూడా తయారు చేస్తూ ఉంటాము. నువ్వుల చిక్కీని తినడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. నువ్వుల చిక్కీని తయారు చేయడం కూడా చాలా సులభం. కేవలం 15 నిమిషాల్లో ఈ చిక్కీని మనం తయారు చేసుకోవచ్చు. నువ్వుల చిక్కీని సులభంగా ఎలా తయారు చేసుకోవాలి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
నువ్వుల చిక్కీ తయారీకి కావల్సిన పదార్థాలు..
నువ్వులు – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – కొద్దిగా.
నువ్వుల చిక్కీ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో నువ్వులు వేసి వేయించాలి. వీటిని మాడిపోకుండా దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఒక ప్లేట్ కు నూనె, నెయ్యి రాసి పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో పంచదార వేసి వేడి చేయాలి. దీనిని నీళ్లు వేయకుండా వేడి చేయాలి. పంచదార పూర్తిగా కరిగిన తరువాత వేయించిన నువ్వులు వేసి కలపాలి. వీటిని రెండు నిమిషాల పాటు కలుపుతూ ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి.
తరువాత ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని గంటెతో లేదా గిన్నెతో వీలైనంత పలుచగా సమానంగా వత్తుకోవాలి. 5 నిమిషాల తరువాత మనకు కావల్సిన ఆకారంలో గాట్లు పెట్టుకోవాలి. ఈ నువ్వుల మిశ్రమం పూర్తిగా చల్లారిన తరువాత ప్లేట్ నుండి వేరు చేసుకుని ముక్కలుగా కట్ చేసుకుని నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే నువ్వుల చిక్కీలు తయారవుతాయి. వీటిని రోజుకు ఒకటి చొప్పున తినడం వల్ల మనం అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.