Oats Omelette : పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాల్లో కోడిగుడ్లు ఒకటి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మనం ఎన్నో ఆరోగ్యకరమైరన ప్రరయోజనాలను పొందవచ్చు. కోడిగుడ్లను ఉడికించి తీసుకోవడంతో పాటు వీటితో వివిధ రకాల ఆహార పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. కోడిగుడ్లతో సులువుగా చేసే ఆహార పదార్థాల్లో ఆమ్లెట్ ఒకటి. దీనిని పప్పు, సాంబార్ వంటి వాటితో కలిపి తింటూ ఉంటాం. ఈ ఆమ్లెట్ ను రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసేలా దీనిలో ఓట్స్ వేసి కూడా తయారు చేసుకోవచ్చు. ఓట్స్ తో ఆమ్లెట్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఓట్స్ ఆమ్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఓట్స్ – 2 టేబుల్ స్పూన్స్, బొంబాయి రవ్వ – ఒక టేబుల్ స్పూన్, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, వంటసోడా – చిటికెడు, నీళ్లు – తగినన్ని, ఉప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన క్యాప్సికం ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన టమాట ముక్కలు – 2 టేబుల్ స్పూన్స్, కోడిగుడ్లు – 3.
ఓట్స్ ఆమ్లెట్ తయారీ విధానం..
ముందుగా ఒక కళాయిలో బొంబాయి రవ్వ, ఓట్స్ వేసి చిన్న మంటపై దోరగా వేయించాలి. తరువాత వీటిని ఒక జార్ లోకి తీసుకుని మెత్తని పొడిలా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో పెరుగు, వంటసోడా, నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం గట్టిగా ఉండేలా చేసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, క్యాప్సికం, టమాట ముక్కలను వేసి బాగా కలపాలి. తరువాత కోడిగుడ్లను వేసి అంతా కలిసేలా బాగా కలపాలి. ఇప్పుడు కళాయిని తీసుకుని అందులో అర టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడాయ్యక మనం తయారు చేసుకున్న ఆమ్లెట్ మివ్రమాన్ని మొత్తం వేయాలి.
తరువాత దీనిపై మరో టీ స్పూన్ నూనె వేసి మూత పెట్టి 5 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఆమ్లెట్ ను మరో వైపుకు తిప్పి మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత స్టవ్ ఆఫ్ చేసి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఓట్స్ ఆమ్లెట్ తయారవుతుంది. దీనిపై మయోనీస్, టమాట సాస్, చిల్లీ ప్లేక్స్ వేసుకుని కూడా తినవచ్చు. దీనిని అల్పాహారంగా లేదా స్నాక్స్ గా కూడా తీసుకోవచ్చు. పిల్లలు ఈ ఆమ్లెట్ ను ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా ఓట్స్ తో ఆమ్లెట్ ను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.