Okra Palli Fry : జిగురుగా ఉండే కూరగాయలు అనగానే ముందుగా అందరికీ గుర్తుకు వచ్చేవి బెండకాయలు. బెండకాయలను కూడా మనం ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాం. ఇతర కూరగాయల లాగా బెండకాయలు కూడా మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. వీటితో వేపుళ్లను, పులుసు కూరలను తయారు చేస్తూ ఉంటాం. బెండకాయతో చేసే వేపుడు ఇతర కూరగాయలతో చేసిన వేపుళ్ల లాగా కరకరలాడుతూ ఉండదు. ఈ వేపుడు కొద్దిగా మెత్తగా ఉంటుంది. మెత్తగా ఉండే బెండకాయ వేపుడును తినడానికి చాలా మంది ఇష్టపడరు. తరచూ చేసే బెండకాయ వేపుడుకు బదులుగా పల్లీలను వేసి కరకరలాడుతూ ఉండే విధంగా కూడా మనం బెండకాయ వేపుడును తయారు చేసుకోవచ్చు. పల్లీలను వేసి కరకరలాడే బెండకాయ వేపుడును ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
బెండకాయ పల్లి వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
బెండకాయలు – అర కిలో, పల్లీలు – 4 టేబుల్ స్పూన్స్, ఆవాలు – పావు టీ స్పూన్, జీలకర్ర – పావు టీ స్పూన్, మినప పప్పు – అర టీ స్పూన్, జీడిపప్పు – 10, నువ్వులు – ఒక టీ స్పూన్, ఎండు మిర్చి – 2, కచ్చా పచ్చగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 5, తరిగిన ఉల్లిపాయ – ఒకటి, కరివేపాకు – ఒక రెబ్బ, నూనె – 4 టేబుల్ స్పూన్స్, పసుపు – పావు టీ ప్పూన్, ధనియాల పొడి – ఒకటీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, ఎండు కొబ్బరి పొడి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత.
బెండకాయ పల్లి వేపుడు తయారీకి కావల్సిన పదార్థాలు..
ముందుగా బెండకాయలను శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక అర గంట పాటు గాలి తగిలేలా బాగా ఆరబెట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల బెండకాయలు జిగురుగా అవకుండా ఉంటాయి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి కాగిన తరువాత ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినపపప్పు, ఎండు మిర్చి, కరివేపాకును వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత పల్లీలను, జీడిపప్పును, నువ్వులను, కచ్చా పచ్చాగా చేసిన వెల్లుల్లి రెబ్బలను ఒక్కొక్కటిగా వేసి వేయించుకోవాలి. ఇవి అన్నీ వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను, పసుపును వేసి వేయించుకోవాలి.
ఉల్లిపాయ ముక్కలు వేగిన తరువాత ముందుగా ఆరబెట్టుకున్న బెంకాయ ముక్కలను వేసి కలిపి మూత పెట్టకుండా బెండకాయ ముక్కలు పూర్తిగా వేగే వరకు వేయించుకోవాలి. బెండకాయలు వేగేటప్పుడు ఉప్పును వేయకూడదు. ఇలా చేయడం వల్ల బెండకాయలు మెత్తగా అవుతాయి. కనుక ఇవి పూర్తిగా వేగిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి వేసి కలిపి మరో 2 నిమిషాల పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా కరకరలాడుతూ ఉండే బెండకాయ పల్లి వేపుడు తయారవుతుంది. అన్నంతో కలిపి ఈ వేపుడును తింటే చాలా రుచిగా ఉంటుంది. తరచూ చేసే బెండకాయ వేపుడుకు బదులుగా ఇలా పల్లీలను వేసి చేసే బెండకాయ వేపుడు చాలా రుచిగా ఉంటుంది. దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.