Masala Buttermilk : వేసవి కాలంలో ఎండ వేడిని తట్టుకోవడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటాం. ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కొందరిలో శరీరంలో వేడి చేసినట్టుగా, నీరసంగా ఉంటూ ఉంటారు. శరీరంలో వేడి తగ్గడానికి చల్లని నీళ్లను, శీతల పానీయాలను తాగడానికి బదులుగా పెరుగుతో బటర్ మిల్క్ ను చేసుకుని తాగడం వల్ల వేడి తగ్గడంతోపాటు శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. బటర్ మిల్క్ ను మనం చాలా సులువుగా తయారు చేసుకోవచ్చు. బటర్ మిల్క్ తో మసాలా బటర్ మిల్క్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ రెండింటినీ ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
బటర్ మిల్క్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, చల్లటి నీళ్లు – ఒక గ్లాస్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, నిమ్మ రసం – ఒక టీ స్పూన్, సన్నగా తరిగిన కరివేపాకు – కొద్దిగా.
బటర్ మిల్క్ తయారీ విధానం.
ముందుగా ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా కవ్వంతో బాగా చిలకాలి. ఇలా చిలికిన పెరుగులో ఉప్పు, చల్లని నీళ్లు, జీలకర్ర పొడి, నిమ్మరసం, కరివేపాకు వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలిపిన దానిని గ్లాసులో పోసుకోవాలి. చల్లగా కావలనుకునే వారు ఇందులో ఐస్ క్యూబ్స్ ను కూడా వేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బటర్ మిల్క్ తయారవుతుంది. ఇప్పుడు మసాలా బటర్ మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం.
మసాలా బటర్ మిల్క్ తయారీ విధానం..
ఇప్పుడు పైన చెప్పిన విధంగా గిన్నెలో పెరుగును తీసుకుని చిలికి కరివేపాకు తప్ప మిగిలిన పదార్థాలు అన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ఒక జార్ లో అర టీ స్పూన్ అల్లం ముక్కలు, సన్నగా తరిగిన కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, 5 పుదీనా ఆకులు, అర ముక్క పచ్చి మిర్చి, చిటికెడు మిరియాల పొడి, ఒక టేబుల్ స్పూన్ పెరుగు, కొద్దిగా నీళ్లను పోసి మెత్తగా మిక్సీ పట్టి జల్లిగంట సహాయంతో వడకట్టాలి. ఇలా వడకట్టగా వచ్చిన మిశ్రమాన్ని ముందుగా తయారు చేసి పెట్టుకున్న బటర్ మిల్క్ లో వేసి కలిపి గ్లాసులో పోసుకోవాలి. ఇలా చేయడం వల్ల మసాలా బటర్ మిల్క్ తయారవుతుంది. రుచికి తగినట్టు ఇలా పెరుగుతో బటర్ మిల్క్ ను చేసుకుని తాగడం వల్ల వేడి తగ్గి శరీరానికి చలువ చేస్తుంది. నీరసం తగ్గి శరీరానికి శక్తి లభిస్తుంది. పెరుగును నేరుగా తినడానికి ఇష్టపడని వారు ఈ విధంగా బటర్ మిల్క్ ను తయారు చేసుకుని తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.