Onion Peanuts Mixture : మనకు సాయంత్రం సమయాల్లో రోడ్ల పక్కన, బీచ్ ల దగ్గర బండ్ల మీద ఎక్కువగా లభించే చిరుతిళ్లల్లో ఆనియన్ మిక్చర్ కూడా ఒకటి. అటుకులు, ఉల్లిపాయలతో చేసే ఈ మిక్చర్ చాలా రుచిగా ఉంటుంది. చాలా మంది దీనిని ఇష్టంగా తింటారు. ఈ మిక్చర్ ను అదే రుచితో సుచిగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. దీనిని తయారు చేయడం చాలా సులభం. ఎవరైనా దీనిని ఇంట్లోనే తేలికగా తయారు చేయవచ్చు. ఇంట్లో ఉండే పదార్థాలతో బండ్ల మీద లభించే ఆనియన్ మిక్చర్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ మిక్చర్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, మందంగా ఉండే అటుకులు- ఒక కప్పు, పల్లీలు – పావు కప్పు, చిన్నగా తరిగిన పెద్ద ఉల్లిపాయలు – 2, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – చిటికెడు, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, చాట్ మసాలా – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, నెయ్యి – ఒక టీ స్పూన్, నిమ్మకాయ – 1.
ఆనియన్ మిక్చర్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అటుకులు వేసి వేయించి టిష్యూ పేపర్ ఉన్న గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత టిష్యూ పేపర్ లను తీసేసి ఇందులో పైన చెప్పిన మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి కలుపుకోవాలి. చివరగా నిమ్మరసం పిండి అంతా కలిసేలా కలుపుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ మిక్చర్ తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. స్నాక్స్ తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా ఆనియన్ మిక్చర్ ను తయారు చేసుకుని తినవచ్చు.