Onion Spring Rolls : మనం ఇంట్లో స్నాక్స్ లాగా స్ప్రింగ్ రోల్స్ ను కూడా తయారు చేస్తూ ఉంటాము. స్ప్రింగ్ రోల్స్ చాలా రుచిగా, క్రిస్పీగా ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. ముఖ్యంగా పిల్లలు మరింత ఇష్టంగా తింటారు. అలాగే ఈ రోల్స్ ను మనం వివిధ రుచుల్లో తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా తయారు చేసుకోగలిగిన రుచికరమైన వెరైటీ స్ప్రింగ్ రోల్స్ లో ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ కూడా ఒకటి. ఆనియన్ స్టఫింగ్ తో చేసే ఈ స్ప్రింగ్ రోల్స్ చాలా రుచిగా ఉంటాయి. చాలా క్రిస్పీగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. స్నాక్స్ గా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఎంతోరుచిగా, క్రిస్పీగా ఉండే ఈ ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావల్సిన పదార్థాలు..
మైదాపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నీళ్లు – ఒకటిన్నర కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
స్టఫింగ్ తయారీకి కావల్సిన పదార్థాలు..
చిన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు – ఒక కప్పు, లావు అటుకులు – అర కప్పు, తరిగిన కొత్తిమీర – 2 టేబుల్ స్పూన్స్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, ఉప్పు – తగినంత, కారం – అర టీ స్పూన్, ధనియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా – అర టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ తయారీ విధానం..
ముందుగా జార్ లో మైదాపిండి, ఉప్పు, ఒక టేబుల్ స్పూన్ నూనె, నీళ్లు పోసి అంతా కలిసేలా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ మిశ్రమాన్ని వడకట్టి గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత స్టఫింగ్ కోసం గిన్నెలో ఉల్లిపాయ ముక్కలను తీసుకోవాలి. తరువాత అటుకులను చేత్తో బాగా నలిపి వేసుకోవాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిని స్టవ్ మీద ఉంచి వేడి చేయాలి. తరువాత అందులో నూనె వేసి స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ముందుగా తయారు చేసుకున్న పిండిని ఒక గంటె మోతాదులో వేసి కళాయి అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత ఎక్కువగా ఉ్న పిండిని మరలా గిన్నెలోకి వంచుకోవాలి. ఇప్పుడు కళాయి నుండి పిండి షీట్ వేరయ్యే వరకు మధ్యస్థ మంటపై వేడి చేయాలి.
షీట్ ను నెమ్మదిగా తీసుకుని ప్లేట్ లో వేసుకోవాలి. ఇలా అన్ని షీట్ లను తయారు చేసుకున్న తరువాత ఒక గిన్నెలో మైదాపిండిని తీసుకుని నీళ్లు పోసి పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కో షీట్ ను తీసుకుని దానిపై ఒక చివరన ఉల్లిపాయ స్టఫింగ్ ను ఉంచాలి. తరువాత ముందుగా ఒక్క చుట్టు రోల్ చేసి ఆ తరువాత అంచులను మధ్యలోకి మడవాలి. తరువాత మైదాపిండి పేస్ట్ ను రాసి రోల్ చేసుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో డీప్ ఫ్రైకు సరిపడా నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రోల్స్ ను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఆనియన్ స్ప్రింగ్ రోల్స్ తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో తింటే చాలా రుచిగా ఉంటాయి.