Orugallu Chepala Pulusu : మనలో చాలా మంది చేపల పులుసును ఇష్టంగా తింటారు. అన్నంతో చేపల పులుసును తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎలా చేసిన కూడా చేపల పులుసు చాలా రుచిగా ఉంటుంది. ఈ పులుసును ఒక్కొక్కరు ఒక్కోలా తయారు చేస్తూ ఉంటారు. తరుచూ ఒకేరకంగా కాకుండా కింద చెప్పిన విధంగా చేసే చేపల పులుసుకూడా చాలా రుచిగా ఉంటుంది. ఓరుగల్లు స్టైల్ లో చేసే ఈ చేపల పులుసు కారంగా, కమ్మగా చాలా రుచిగా ఉంటుంది. చేపలను తినని వారు కూడా ఈ పులుసును ఇష్టంగా తింటారు. దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మరింత రుచిగా ఓరుగల్లు స్టైల్ లో చేపల పులుసును ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఓరుగల్లు చేపల పులుసు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉల్లిపాయలు – 3, నానబెట్టిన చింతపండు – పెద్ద నిమ్మకాయంత, నూనె – అర కప్పు, చిన్నగా తరిగిన ఉల్లిపాయలు – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – 2 నుండి 3 టీ స్పూన్స్, నీళ్లు – తగినన్ని, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
మ్యారినేషన్ కు కావల్సిన పదార్థాలు..
చేప ముక్కలు – కిలో, ఉప్పు – ఒక టీ స్పూన్, కారం – 2 టీ స్పూన్స్, పసుపు – పావు టీ స్పూన్.
మసాలా తయారీకి కావల్సిన పదార్థాలు..
మెంతులు – 20 గింజలు, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – ఒక టీ స్పూన్.
ఓరుగల్లు చేపల పులుసు తయారీ విధానం..
ముందుగా చేప ముక్కలను శుభ్రంగా కడిగి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, పసుపు, కారం వేసి ముక్కలకు బాగా పట్టించి మూత పెట్టి పక్కకు ఉంచాలి. తరువాత కళాయిలో మెంతులు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత ధనియాలు, జీలకర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఉల్లిపాయలపై ఉండే పొట్టును తీసేసి వాటిని మంటపై కాల్చుకోవాలి. ఉల్లిపాయలు లోపలి వరకు మెత్తగా ఉడికి చక్కగా కాలిన తరువాత వీటిని ప్లేట్ లోకి తీసుకుని చల్లారనివ్వాలి. తరువాత జార్ లో వేయించిన మెంతులు వేసి మెత్తని పొడిగా చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో ఉల్లిపాయలు కూడావేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి వేయించాలి.
ఇవన్నీ వేగిన తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. తరువాత ఉల్లిపాయ పేస్ట్ వేసి కలపాలి. దీనిని నూనె పైకి తేలే వరకు వేయించిన తరువాత చింతపండు రసం, నీళ్లు పోసి కలపాలి. పులుసు మరిగిన తరువాత చేప ముక్కలు వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పొడిలో నీళ్లు పోసి కలిపి వేసుకోవాలి. అంతా కలిసేలా గిన్నెను కదుపుతూ కలుపుకున్న తరువాతమూత పెట్టి చిన్న మంటపై ముక్క మెత్తగా అయ్యి నూనె పైకి తేలే వరకు ఉడికించాలి.ఇలా ఉడికించిన తరువాత కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసి వేడి వేడిగా సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఓరుగల్లు చేపల పులుసు తయారవుతుంది. ఈ విధంగా తయారు చేసిన చేపల పులుసును అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.