Pabbiyyam : తెలంగాణాలో పండగలకు, ఫంక్షన్ లకు ఎక్కువగా వండే రుచికరమైన వంటకాల్లో పబ్బియ్యం కూడా ఒకటి. బియ్యం, శనగపప్పు కలిపి చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. దీనిని తినడం వల్లల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. ఈ పబ్బియ్యం వాసన చూస్తేనే కడుపు నిండిన భావన కలుగుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు ఈ పబ్బియ్యాన్ని వండుకుని నేరుగా తినవచ్చు. కమ్మటి వాసన, రుచితో కూడిన పబ్బియాన్ని ఎలా వండుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పబ్బియ్యం తయారీకి కావల్సిన పదార్థాలు..
బాస్మతీ బియ్యం- ఒక కప్పు, శనగపప్పు – అర కప్పు, నూనె – 2 టేబుల్ స్పూన్స్, బిర్యానీ ఆకులు – 2, అనాస పువ్వు – 1, లవంగాలు – 4, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, యాలకులు – 3, కరివేపాకు – ఒక రెమ్మ, తరిగిన పచ్చిమిర్చి – 4, వెల్లుల్లి రెబ్బలు – 10, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టేబుల్ స్పూన్, చిన్న ఉల్లిపాయలు – 3, తరిగిన బంగాళాదుంప – 1, తరిగిన క్యారెట్ – 1, తరిగిన బీన్స్ – 6, పచ్చి బఠాణీ – పావు కప్పు, తరిగిన టమాట – 1, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన పుదీనా – కొద్దిగా, వేడి నీళ్లు – 3 కప్పులు.

పబ్బియ్యం తయారీ విధానం..
ముందుగా గిన్నెలో బియ్యాన్ని, శనగపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత నీళ్లు పోసి అరగంట పాటు నానబెట్టాలి. బియ్యం నానిన తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత మసాలా దినుసులు వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. తరువాత కూరగాయ ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చి బఠాణీ వేసి కలపాలి. వీటిని 5 నిమిషాల పాటు వేయించిన తరువాత కొత్తిమీర, పుదీనా వేసి కలపాలి. తరువాత నానబెట్టిన బియ్యం, పప్పు వేసి కలపాలి.
వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు, ఉప్పు వేసి కలపాలి. ఇప్పుడు మూత పెట్టి చిన్న మంటపై అన్నం పూర్తిగా ఉడికే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పబ్బియ్యం తయారవుతుంది. దీనిని వెజ్, నాన్ వెజ్ వంటకాలతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వీకెండ్స్ లో, స్పెషల్ డేస్ లో వెరైటీగా ఇలా పబ్బియ్యాన్ని తయారు చేసుకుని తినవచ్చు.