Menthikura Roti Pachadi : మనం మెంతికూరను కూడా ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. మెంతికూర మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుందన్న సంగతి మనకు తెలిసిందే. బరువు తగ్గడంలో, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో, రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో ఇలా అనేక రకాలుగా మెంతికూర మనకు సహాయపడుతుంది. ఎక్కువగా ఈ మెంతికూరతో మనం పప్పును తయారు చేస్తూ ఉంటాము. పప్పుతో పాటు మెంతికూరతో మనం ఎంతో రుచిగా ఉండే రోటి పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. మెంతికూరతో చేసే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ పచ్చడిని చూస్తేనే నోట్లో నీళ్లు ఊరిపోతాయని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఎంతో రుచిగా ఉండే మెంతికూర రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి..అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
మెంతికూర రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
తరిగిన మెంతికూర – 3 కట్టలు, నూనె – 2 టీ స్పూన్స్, ఎండుమిర్చి – 8 నుండి 10, ధనియాలు – 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, చింతపండు – చిన్న నిమ్మకాయంత, వెల్లుల్లి రెబ్బలు – 5.
మెంతికూర రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వేసి వేయించాలి. తరువాత వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కకు ఉంచాలి. తరువాత అదే కళాయిలో మరికొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. తరువాత మెంతికూర, పసుపు, ఉప్పు, చింతపండు వేసి కలపాలి. తరువాత మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ మెంతికూరను పూర్తిగా వేయించాలి. మెంతికూర వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత రోట్లో ముందుగా వేయించిన దినుసులు, ఎండుమిర్చి వేసి బరకగా దంచుకోవాలి.
తరువాత వెల్లుల్లి రెబ్బలు వేసి దంచుకోవాలి. తరువాత మెంతికూర వేసి దంచుకోవాలి. పచ్చడి గట్టిగా ఉండే వేడి నీటిని పోసి దంచుకోవచ్చు. తరువాత ఈ పచ్చడిని గిన్నెలోకి తీసుకుని తాళింపు దినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి, ఇంగువతో తాళింపు చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే మెంతికూర రోటి పచ్చడి తయారవుతుంది. దీనిని జార్ లో వేసి కూడా తయారు చేసుకోవచ్చు. అన్నం, నెయ్యితో తింటే ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా మెంతికూరతో పచ్చడి తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.