Pachi Kova : మనం వంటింట్లో రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. తీపి వంటకాలను మనలో చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. తీపి వంటకాలను తయారు చేయడానికి మనం ఎక్కువగా పచ్చి కోవాను ఉపయోగిస్తూ ఉంటాం. పచ్చిరకోవాతో తయారు చేసిన తీపి వంటకాలు మరింత రుచిగా ఉంటాయి. పచ్చికోవాతో మనం క్యారెట్ హల్వా, కోవాబాల్స్, గులాబ్ జామున్, సొరకాయ హల్వా, డబల్ కా మీటా వంటి రకరకాల తీపి వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. సాధారణంగా ఈ పచ్చికోవాను మనం ఎక్కువగా బయట కొనుగోలు చేస్తూ ఉంటాం. బయట కొనుగోలు చేసే పని లేకుండా ఈ కోవాను మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. దీని తయారీకి సమయం ఎక్కువగా పట్టినప్పటికి తయారు చేయడం మాత్రం చాలా సులభం. పచ్చికోవాను ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు.. ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పచ్చి కోవ తయారీకి కావల్సిన పదార్థాలు..
నీళ్లు – పావు కప్పు, చిక్కటి పాలు – రెండు లీటర్లు, వంటసోడా – చిటికెడు.
పచ్చి కోవ తయారీ విధానం..
ముందుగా అడుగు మందంగా ఉండే కళాయిలో నీళ్లు, పాలు పోసి మధ్యస్థ మంటపై కలుపుతూ వేడి చేయాలి. పాలు అడుగు అంటకుండా అలాగే అంచులకు మీగడ కట్టకుండా పాలను కలుపుతూ వేడి చేయాలి. పాలు బాగా మరిగి చిక్కగా అయిన తరువాత వంటసోడా వేసి కలపాలి. దీనిని మరలా దగ్గర పడే వరకు కలుపుతూ వేడి చేయాలి. ఇలా 45 నిమిషాల పాటు కలుపుతూ వేడి చేసిన తరువాత పచ్చి కోవ తయారవుతుంది. ఈ కోవాను కళాయి అంచుల వెంబడి రాసి పూర్తిగా చల్లారనివ్వాలి. తరువాత పప్పు గుత్తితో కోవాను మెత్తగా నలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల పచ్చి కోవా తయారవుతుంది. దీనిని ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవడం వల్ల రెండు నెలల పాటు ఈ కోవ తాజాగా ఉంటుంది. ఇలా తయారు చేసుకున్న కోవాతో మనకు కావాల్సిన తీపి వంటకాలను తయారు చేసుకుని తినవచ్చు.