Palagunda Junnu : మనం క్యారెట్స్ తో చేసుకోదగిన రుచికరమైన తీపి వంటకాల్లో పాలగుండ జున్ను కూడా ఒకటి. పాలగుండ పొడి, క్యారెట్స్ కలిపి చేసే ఈ జున్ను చాలా రుచిగా ఉంటుంది. చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు ఎవరైనా ఈ జున్నును తినవచ్చు. దీనిని తినడం వల్ల కంటిచూపు మెరుగుపడుతుంది. ఒంట్లో వేడి తగ్గుతుంది. కడుపులో మంట, అల్సర్ వంటి జీర్ణసమస్యలు తగ్గుతాయి. చర్మ ఆరోగ్యం కూడా మెరుగుపడుతుంది. రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని అందించే ఈ పాలగుండ జున్నును తయారు చేయడం చాలా సులభం. మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే ఈ పాలగుండ పొడి అలాగే క్యారెట్స్ తో ఈ తీపి వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలగుండ జున్ను తయారీకి కావల్సిన పదార్థాలు..
ఎరుపు రంగులో ఉండే క్యారెట్స్ – 2, ఆరోరూట్(పాలగుండ) పొడి లేదా కార్న్ ఫ్లోర్ – అర కప్పు, పటిక బెల్లం పొడి – రుచికి తగినంత లేదా అర కప్పు, వెనీలా ఎసెన్స్ – 2 చుక్కలు, నీళ్లు -ఒక కప్పు, ఫుడ్ కలర్ – 3 చుక్కలు.
పాలగుండ జున్ను తయారీ విధానం..
ముందుగా క్యారెట్ ను ముక్కలుగా కట్ చేసుకుని లోపల ఉండే తెల్లటి భాగాన్ని తీసివేయాలి . తరువాత ఈ క్యారెట్ లను శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇవి మునిగే వరకు నీటిని పోసి మూత పెట్టి ముక్కలను మెత్తగా ఉడికించాలి. ముక్కలు ఉడికిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. తరువాత ఈ ముక్కలను వడకట్టి జార్ లో వేసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు మనో గిన్నెలో క్యారెట్ ముక్కలను ఉడికించగా మిగిలిన నీటిని వడకట్టి తీసుకోవాలి. ఇందులో పాలగుండ పొడి, పటిక బెల్లం పొడి, వెనీలా ఎసెన్స్ వేసి కలపాలి. తరువాత మిక్సీ పట్టుకున్న క్యారెట్ మిశ్రమం, నీళ్లు పోసి కలపాలి. ఇప్పుడు అడుగు మందంగా ఉండే కళాయిలో ముందుగా తయారు చేసుకున్న క్యారెట్ మిశ్రమం వేసి బాగా కలపాలి.
దీనిని కలుపుతూ దగ్గర పడే వరకు ఉడికించాలి. ఈ మిశ్రమం కొద్దిగా చల్లారిన తరువాత ఫుడ్ కలర్ వేసి కలపాలి. ఇలా 15 నుండి 20 నిమిషాల పాటు ఉడికించిన తరువాత క్యారెట్ మిశ్రమం పూర్తిగా దగ్గర పడుతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన గిన్నెలో వేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని పూర్తిగా చల్లారే వరకు అలాగే ఉంచాలి. పూర్తిగా చల్లారిన తరువాత ప్లేట్ లోకి తీసుకుని కట్ చేసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పాలగుండ జున్ను తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.