Palak Soup : మనం పాలకూరను ఆహారంగా తీసుకుంటూ ఉంటాము. పాలకూరతో ఎన్నో పోషకాలు ఉన్నాయి. దీనిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. పాలకూరతో మనం ఎక్కువగా పప్పు, పాలక్ రైస్, కూర, పాలక్ పకోడి వంటి వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం పాలకూరతో సూప్ ను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ సూప్ చాలా రుచిగా ఉంటుంది. వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వేడి వేడిగా దీనిని తాగితే రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు. బరువు తగ్గాలనుకునే వారు ఈ సూప్ ను తాగడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. ఈ సూప్ ను తాగితే పొట్ట నిండిన భావన కలుగుతుంది. ఉదయం లేదా సాయంత్రం సమయంలో , అలాగే లేనప్పుడు ఇలా సూప్ ను చేసి తీసుకోవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే ఈ పాలక్ సూప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పాలక్ సూప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలకూర – 2 పెద్ద కట్టలు, నూనె – ఒక టీ స్పూన్, బటర్ – ఒక టీ స్పూన్, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, దంచిన అల్లం తరుగు – అర ఇంచు ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, జొన్న పిండి – ఒక టీ స్పూన్, ఉప్పు – తగినంత, వేయించిన జీలకర్ర పొడి – అర టీ స్పూన్, నీళ్లు – 300 ఎమ్ ఎల్, లవంగాలు – 2, యాలకులు – 2, దాల్చిన చెక్క – ఒక ఇంచు ముక్క, బిర్యానీ ఆకు – చిన్నది ఒకటి, నల్ల మిరియాలు – అర టీ స్పూన్.
పాలక్ సూప్ తయారీ విధానం..
ముందుగా గిన్నెలో నీటిని పోసి వేడి చేయాలి. నీళ్లు వేడయ్యాక పాలకూర వేసి నిమిషాల పాటు ఉడికించాలి. తరువాత ఈ పాలకూరను చల్లటి నీటిలో వేసి ఉంచాలి. పాలకూర చల్లారిన తరువాత జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత కళాయిలో బటర్, నూనె వేసి వేడి చేయాలి. తరువాత వెల్లుల్లి రెబ్బలు, అల్లం తరుగు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవన్నీ వేగిన తరువాత జొన్న పిండి వేసి కలపాలి. దీనిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత మిక్సీ పట్టుకున్న పాలకూర పేస్ట్ వేసి కలపాలి.
తరువాత ఉప్పు, జీకలర్ర పొడి వేసి కలపాలి. ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. నీళ్లు పొంగు వచ్చేటప్పుడు లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, మిరియాలు వేసి కలపాలి. తరువాత దీనిని మరో 3 నుండి 4 నిమిషాల పాటు బాగా మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత ఈ సూప్ ను వడకట్టి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలక్ సూప్ తయారవుతుంది. దీనిని వేడి వేడిగా తీసుకుంటేనే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పాలకూరతో చేసిన ఈ సూప్ ను అందరూ ఎంతో ఇష్టంగా తాగుతారు.