Palakova : మనకు స్వీట్ షాపుల్లో లభించే పదార్థాల్లో పాలకోవా కూడా ఒకటి. పాలకోవా చాలా రుచిగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. పాలకోవా రుచిగా ఉన్నప్పటికి దీనిని తయారు చేయడానికి ఎక్కువ సమయం పడుతుంది.అలాగే పాలకోవా తయారు చేయడం కొద్దిగా శ్రమతో కూడుకున్న పని అనే చెప్పవచ్చు. ఎటువంటి శ్రమ లేకుండా చాలా తక్కువ సమయంలో పాలపొడితో కూడా మనం పాలకోవాను తయారు చేసుకోవచ్చు. పాలపొడితో చేసే ఈ పాలకోవా కూడా అచ్చం అదే రుచిని కలిగి ఉంటుంది. నోట్లో వేసుకుంటే కరిగిపోయేంత రుచిగా, మెత్తగా ఉండేలా పాలపొడితో పాలకోవాను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలకోవా తయారీకి కావల్సిన పదార్థాలు..
పాలపొడి – ఒక కప్పు, పంచదార – అర కప్పు, పాలు – అర కప్పు, నెయ్యి – 2 టేబుల్ స్పూన్స్.
పాలకోవా తయారీ విధానం..
ముందుగా కళాయిలో నెయ్యి, పాలపొడి, పంచదార, పాలు వేసి కలుపుతూ వేడి చేయాలి. పంచదార కరిగే వరకు బాగా కలపాలి. పంచదార కరిగిన తరువాత చిన్న మంటపై కలుపుతూ వేడి చేయాలి. ఇలా 5 నిమిషాల పాటు కలిపిన తరువాత కోవా చిక్కబడుతుంది. దీనిని కళాయికి అంటుకోకుండా వేరయ్యే వరకు కలుపుతూ వేడి చేయాలి. ఈ మిశ్రమం ముద్దగా అయిన తరువాత స్టవ్ ఆఫ్ చేసుకుని కొద్దిగా చల్లారనివ్వాలి. తరువాత కొద్ది కొద్దిగా మిశ్రమాన్ని తీసుకుంటూ ఉండలుగా చేసుకోవాలి లేదా మనకు నచ్చిన ఆకారంలో వత్తుకోవాలి. ఇలా చేయడం వల్ల పాలకోవా తయారవుతుంది. తీపి తినాలనిపించినప్పుడు ఇలా పాలపొడితో అప్పటికప్పుడూ ఎంతో రుచిగా ఉండే పాలకోవాను తయారు చేసుకుని తినవచ్చు. ఈ విధంగా తయారు చేసిన పాలకోవా 5 రోజుల పాటు తాజాగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.