Pallila Karam Podi : పల్లీలను చాలా మంది అనేక రకాల వంటల్లో వేస్తుంటారు. వీటితో స్వీట్లు తయారు చేయవచ్చు. మసాలా కూరల్లో వీటిని పొడిలా పట్టి వేస్తారు. వీటిని పచ్చి మిర్చితో కలిపి పచ్చడి కూడా చేయవచ్చు. ఇలా పల్లీలను ఎన్నో రకాలుగా మనం ఉపయోగిస్తుంటాం. అయితే పల్లీలతో ఎంతో రుచికరమైన కారం పొడిని కూడా తయారు చేయవచ్చు. దీన్ని చేయడం కూడా సులభమే. పల్లీలతో కారం పొడిని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లీల కారం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – 2 కప్పులు, వెల్లుల్లి – 1, ఎండు మిర్చి – 7, బెల్లం – చిన్న (ఇష్టం ఉంటేనే), ఉప్పు – రుచికి సరిపడా.
పల్లీల కారం పొడిని తయారు చేసే విధానం..
ముందుగా స్టవ్ పై కడాయి పెట్టి పల్లీలను వేయించుకోవాలి. పల్లీలను మొత్తం ఎర్రగా వేయించుకున్న తరువాత ఎండు మిర్చి వేసి కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం పాటు వేయించుకోవాలి. ఇప్పుడు పల్లీలను పొట్టు తీసి పక్కన పెట్టుకోవాలి. ముందుగా మిక్సీలో వేయించుకున్న ఎండు మిర్చి, రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా పట్టుకోవాలి. అందులో పల్లీలు వేసి మెత్తగా పట్టాలి. తరువాత వెల్లుల్లిని కూడా వేసి పట్టుకోవాలి. అందులో ఇష్టమైతే బెల్లం వేసుకోవచ్చు. లేకపోతే లేదు. బెల్లాన్ని బాగా తురిమి అందులోనే వేసి మిక్సీ పట్టాలి. చివరిగా ఒకసారి మళ్లీ ఉప్పు చూసి అవసరం అయితే కలుపుకోవాలి. దీంతో ఎంతో రుచికరమైన పల్లీల కారం పొడి రెడీ అవుతుంది. దీన్ని అన్నంలో నెయ్యితో కలిపి తినవచ్చు. ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టంగా తింటారు.