Pallilu Nuvvula Laddu : మనం పల్లీలతో, నువ్వులతో రకరకాల రుచుల్లో లడ్డూలను తయారు చేస్తూ ఉంటాం. విడివిడిగా కాకుండా ఈ రెండింటిని కలిపి కూడా మనం లడ్డూలను తయారు చేసుకోవచ్చు. పల్లీలు, నువ్వులను కలిపి చేసే లడ్డూలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా తేలిక. అలాగే ఈ లడ్డూలను తినడం వల్ల మన శరీరానికి కావల్సిన ముఖ్‌యమైన పోషకాలు కూడా లభిస్తాయి. కేవలం నిమిషాల వ్యవధిలోనే రుచిగా, సులభంగా పల్లి నువ్వుల లడ్డూను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పల్లి నువ్వుల లడ్డూ తయారీకి కావల్సిన పదార్థాలు..
పల్లీలు – ఒక కప్పు, నువ్వులు – ఒక కప్పు, బెల్లం తురుము – ఒక కప్పు, యాలకులు – 3, నెయ్యి – ఒక టీ స్పూన్.
పల్లి నువ్వుల లడ్డూ తయారీ విధానం..
ముందుగా కళాయిలో పల్లీలను వేసి మధ్యస్థ మంటపై మాడిపోకుండా దోరగా వేయించాలి. తరువాత వాటిని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత వాటిపై పొట్టును తీసేసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నువ్వులను కూడా వేసి దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఒక జార్ లో వేయించి పొట్టు తీసిన పల్లీలు, బెల్లం తురుము వేసి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అదే జార్ లో నువ్వులు, యాలకులు వేసి కచ్చా పచ్చాగా మిక్సీ పట్టుకుని అదే ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి.
తరువాత నెయ్యి కూడా వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత కొద్ది కొద్దిగా బెల్లం మిశ్రమాన్ని తీసుకుంటూ లడ్డూలుగా చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పల్లి నువ్వుల లడ్డూ తయారవుతుంది. దీనిని పిల్లలకు ఇవ్వడం వల్ల రుచితో పాటు చక్కటి ఆరోగ్యాన్ని కూడా అందిచవచ్చు. ఈ లడ్డూలు వారం రోజుల వరకు నిల్వ ఉంటాయి. తీపి తినాలనిపించినప్పుడు ఈ విధంగా రుచితో పాటు ఆరోగ్యానికి మేలు చేసేలా ఇలా లడ్డూలను తయారు చేసుకుని తినవచ్చు.