Palu Kobbari Payasam : మన తెలుగు ఇళ్లలో చాలా మంది పాయసాన్ని తయారు చేస్తుంటారు. చిన్న పండుగ వచ్చినా.. ఏదైనా శుభ కార్యం అయినా చాలు.. పాయసం ముందు వరుసలో ఉంటుంది. దీన్ని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. అయితే పాలు, కొబ్బరి వేసి చేసే పాయసం ఇంకా రుచిగా ఉంటుంది. దాన్ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పాలు, కొబ్బరి పాయసం తయారీకి కావల్సిన పదార్థాలు..
తాజా కొబ్బరి తురుము – 1 కప్పు, చక్కెర – ముప్పావు కప్పు, పాలు – అర కప్పు, బియ్యం – 2 టేబుల్ స్పూన్లు, యాలకుల పొడి – అర టీస్పూన్, నెయ్యి – 1 టీస్పూన్, బాదం పప్పు (తరిగినవి) – తగినన్ని.

పాలు, కొబ్బరి పాయసం తయారు చేసే విధానం..
ముందుగా బియ్యాన్ని 2 గంటల పాటు నానబెట్టాలి. తరువాత అందులో కొబ్బరి తురుం వేసి మెత్తగా పట్టుకోవాలి. ఒక గిన్నెలో ఈ మిశ్రమాన్ని తీసుకుని ఉడకబెట్టాలి. ఈ మిశ్రమం ఉడుకుతున్నప్పుడే అందులో చక్కెర, పాలు పోసి బాగా కలపాలి. పాయసం చిక్కబడుతున్నప్పుడు అందులో యాలకుల పొడి, నేతిలో వేయించిన బాదం పప్పు వేసి దింపాలి. అంతే.. వేడి వేడి పాలు, కొబ్బరి పాయసం తయారవుతుంది. దీన్ని వేడిగా తింటే ఎంతో మజాగా ఉంటుంది. అందరూ దీన్ని ఎంతో ఇష్టంగా తింటారు.