Pandu Mirchi Allam Pachadi : మనం ఉదయం బ్రేక్‌ఫాస్ట్ లేదా మధ్యాహ్నం, రాత్రి చేసే భోజనాల్లో పచ్చళ్లను ఎక్కువగా తింటుంటాం. వాటిల్లో అల్లం పచ్చడి కూడా ఒకటి. దీన్ని కొందరు కేవలం బ్రేక్‌ఫాస్ట్ కోసం తయారు చేస్తుంటారు. ఇడ్లీలు, దోశలు వంటి వాటితో తింటుంటారు. కొందరు కేవలం అన్నంతోనే తినేలా చేస్తారు. అయితే ఇప్పుడు చెప్పబోయే అల్లం పచ్చడిని బ్రేక్‌ఫాస్ట్‌లతోపాటు అన్నంలోనూ కలిపి తినవచ్చు. ఇది రెండింటికీ పనిచేస్తుంది. దీన్ని తయారు చేయడం కూడా సులభమే. పండు మిర్చితో అల్లం పచ్చడిని ఎలా తయారు చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పండు మిర్చి అల్లం పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పండు మిరపకాయలు – 10, అల్లం – 20 గ్రాములు, ఆవాలు – అర టీస్పూన్, జీలకర్ర – అర టీస్పూన్, శనగపప్పు – అర టీస్పూన్, ఎండు మిరపకాయలు – 2, కరివేపాకు – రెండు రెబ్బలు, వెల్లుల్లి రెబ్బలు – 4, చక్కెర – చిటికెడు, ఉప్పు – రుచికి సరిపడా, నిమ్మరసం – అర కప్పు, మెంతిపొడి – చిటికెడు, నూనె – అర కప్పు, ఇంగువ – చిటికెడు.
పండు మిర్చి అల్లం పచ్చడిని తయారు చేసే విధానం..
ముందుగా అల్లంను మిక్సీలో వేసి గ్రైండ్ చేయాలి. తరువాత అందులో పండు మిరపకాయలు, కొద్దిగా ఉప్పు వేసి మళ్లీ గ్రైండ్ చేయాలి. తరువాత అందులో చక్కెర, మెంతిపొడి వేసి మరొకసారి గ్రైండ్ చేయాలి. ఇప్పుడు స్టవ్‌పై పాన్ పెట్టి నూనె వేయాలి. నూనె కాస్త వేడి అయ్యాక ఆవాలు, జీలకర్ర వేయాలి. ఇవి వేగిన తరువాత శనగపప్పు, ఇంగువ వేయాలి. వెల్లుల్లి రెబ్బలు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి కలియబెట్టాలి. చివరగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పండు మిర్చి, అల్లం మిశ్రమం వేసి కలపాలి. కాసేపు చిన్న మంటపై ఉంచి దింపాలి. దీంతో ఎంతో రుచికరమైన పండు మిర్చి అల్లం పచ్చడి రెడీ అవుతుంది. దీన్ని ఉదయం చేసే బ్రేక్‌ఫాస్ట్ ఏదైనా సరే.. దాంతో కలిపి తినవచ్చు. ఇడ్లీలు, దోశలే కాదు.. అన్నం, చపాతీల్లోకి కూడా ఈ పచ్చడి ఎంతో రుచిగా ఉంటుంది. అందరూ ఇష్టపడతారు.