Pandumirapakaya Roti Pachadi : పండుమిర్చితో మనం రకరకాల పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. ఎక్కువగా నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. కేవలం నిల్వ పచ్చళ్లే కాకుండా పండుమిర్చితో రోటి పచ్చడిని కూడా తయారు చేసుకోవచ్చు. అన్నంతో తినడానికి ఈ పచ్చడి చాలా రుచిగా ఉంటుంది. దీనిని తయారు చేసుకోవడం చాలా సులభం. ఈ పచ్చడి తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా, పుల్ల పుల్లగా, కమ్మగా ఉంటుంది. కూర లేకపోయినా కూడా ఈ పచ్చడితో కడుపు నిండా భోజనం చేయవచ్చు. పండుమిర్చితో ఎంతో కమ్మగా ఉండే రోటి పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో.. ఇప్పుడు తెలుసుకుందాం.
పండుమిర్చి రోటి పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
పండుమిర్చి – 10 నుండి 12, నూనె – ఒక టేబుల్ స్పూన్, శనగపప్పు – ఒక టీ స్పూన్, మినపప్పు – ఒక టీ స్పూన్, మెంతులు – చిటికెడు, జీలకర్ర – ఒక టీ స్పూన్, చింతపండు – నిమ్మకాయంత, పసుపు – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత.
పండుమిర్చి రోటి పచ్చడి తయారీ విధానం..
ముందుగా పండుమిర్చిని శుభ్రంగా కడిగి తడి లేకుండా అరబెట్టుకోవాలి. ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత మెంతులు వేసి వేయించాలి. తరువాత జీలకర్ర వేసి వేయించాలి. తరువాత పండుమిర్చి, చింతపండు వేసి వేయించాలి. ముక్కలు మగ్గి, చింతపండు మెత్తబడిన తరువాత పసుపు వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత వీటిని రోటిలో వేసి మెత్తగా దంచుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడిచేయాలి. తరువాత తాళింపు దినుసులు, ఇంగువ, ఎండుమిర్చి, దంచిన 4 వెల్లుల్లి రెమ్మలు, కరివేపాకు వేసి వేయించాలి.తాళింపు వేగిన తరువాత ఇందులో పచ్చడిని వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పండుమిర్చి రోటి పచ్చడి తయారవుతుంది. రోలు లేని వారు జార్ లో కూడా ఈ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. వేడి వేడి అన్నంలో నెయ్యితో ఈ పచ్చడిని తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈపచ్చడిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.