Paneer Fried Rice : మనం వంటింట్లో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. రైస్ తో వెరైటీలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడానికి సమయం కూడా ఎక్కువగా పట్టదు. అలాగే వీటిని ఎవరైనా చాలా తేలికగా తయారు చేసుకోవచ్చు. మనం సులభంగా చేసుకోదగిన రైస్ వెరైటీలలో పన్నీర్ ఫ్రైడ్ రైస్ కూడా ఒకటి. పన్నీర్ తో చేసే ఈ ఫ్రైడ్ చాలా రుచిగా ఉంటుంది. మనకు ఎక్కువగా రెస్టారెంట్ లలో ఈ ఫ్రైడ్ రైస్ దొరుకుతుంది. అచ్చం అదే రుచితో ఈ ఫ్రైడ్ రైస్ మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ ఫ్రైడ్ రైస్ ను ఇంట్లో ఏ విధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – 4 టీ స్పూన్స్, పన్నీర్ – 200 గ్రా., టమాట కిచప్ – ఒక టేబుల్ స్పూన్, క్యారెట్ తరుగు – పావు కప్పు, చిన్నగా తరిగిన ఫ్రెంచ్ బీన్స్ – 4, అన్నం – ఒక కప్పు బాస్మతీ బియ్యంతో వండినంత, ఉప్పు – తగినంత, లైట్ సోయాసాస్ – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, తెల్ల మిరియాల పొడి – అర టీ స్పూన్, స్ప్రింగ్ ఆనియన్స్ – 2 టేబుల్ స్పూన్స్.

పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారీ విధానం..
ముందుగా కళాయిలో 2 టీ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పన్నీర్ ముక్కలు వేసి ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాట కిచప్ వేసి టాస్ చేసుకోవాలి. తరువాత చిటికెడు ఉప్పు, చిటికెడు కారం వేసి కలిపి ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక క్యారెట్ తరుగు, బీన్స్ తరుగు వేసి వేయించాలి. క్యారెట్ సగానికి పైగా వేగిన తరువాత అన్నం వేసి కలపాలి. తరువాత ఉప్పు, సోయాసాస్, మిరియాల పొడి, తెల్ల మిరియాల పొడి వేసి అంతా కలిసేలా కలుపుకోవాలి. తరువాత వేయించిన పన్నీర్ ముక్కలు వేసి కలపాలి. దీనిని ఒక నిమిషంపాటు కలుపుతూ వేయించిన తరువాత స్ప్రింగ్ ఆనియన్స్ ను చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పన్నీర్ ఫ్రైడ్ రైస్ తయారవుతుంది. లంచ్ బాక్స్ లోకి ఈ రైస్ చాలా చక్కగా ఉంటుంది. దీనిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.