Pappu Charu : మనం అప్పుడప్పుడూ పప్పుచారును కూడా తయారు చేస్తూ ఉంటాం. కొందరికి రోజూ పప్పుచారు ఉండాల్సిందే. పప్పుచారును రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. వెజ్, నాన్ వెజ్ వేపుడు కూరలను పప్పుచారుతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ పప్పుచారును తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండేలా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పప్పుచారు తయారీకి కావల్సిన పదార్థాలు..
కందిపప్పు – ఒక టీ గ్లాస్, తరిగిన పచ్చిమిర్చి – 3, పెద్ద ముక్కలుగా తరిగిన టమాటాలు – 2, తరిగిన ములక్కాడ – 1, చింతపండు – 10 గ్రా., ఉప్పు – తగినంత, పసుపు – అర టీ స్పూన్, కారం – ఒక టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, జీలకర్ర – అర టీ స్పూన్, ఇంగువ – చిటికెడు, ఎండుమిర్చి – 2, కచ్చా పచ్చాగా దంచిన వెల్లుల్లి రెబ్బలు – 4, కరివేపాకు – ఒక రెమ్మ, సన్నగా పొడుగ్గా తరిగిన ఉల్లిపాయ – 1.
పప్పుచారు తయారీ విధానం..
ముందుగా అర గ్లాస్ నీళ్లను పోసి చింతపండును నానబెట్టుకోవాలి. ఇప్పుడు కుక్కర్ లో కందిపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత అందులో ఒక గ్లాస్ నీళ్లను పోయాలి. ఇందులోనే పచ్చిమిర్చి, టమాట ముక్కలను వేయాలి. తరువాత ఒక చిన్న గిన్నెలో మునక్కయా ముక్కలను ఉంచి అదే కుక్కర్ లో ఉంచాలి. ఇప్పుడు కుక్కర్ పై మూతను ఉంచి మూడు విజిల్స్ వచ్చే వరకు ఉడికించాలి. తరువాత మునక్కాయ ముక్కలను తీసి పప్పును మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో ఉడికించిన మునక్కాయ ముక్కలు, ఉప్పు, కారం, చింతపండు రసం, పసుపు వేసి బాగా కలుపుకోవాలి.
తరువాత రెండు గ్లాసుల నీటిని పోసి కలపాలి. పప్పుచారు పలుచగా కావాలనుకున్న వారు మరో గ్లాస్ నీటిని కూడా పోసుకోవచ్చు. ఇలా తయారు చేసుకున్న పప్పుచారును స్టవ్ మీద ఉంచి 15 నిమిషాల పాటు మరిగించాలి. ఇప్పుడు మరో స్టవ్ మీద కళాయిని ఉంచి అందులో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపును పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి తాళింపు చేసుకోవాలి. ఈ తాళింపు వేగిన తరువాత దీనిని మరిగించిన పప్పుచారులో వేసి మరో రెండు నిమిషాల పాటు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పప్పు చారు తయారవుతుంది. దీనిని అన్నంతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. వేపుడు కూరలతో పాటు ఇలా పప్పుచారును కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది.