Perfect Upma Recipe : ఉప్మా.. మనం అల్పాహారంలో భాగంగా దీనిని కూడా తయారు చేసుకుని తింటూ ఉంటాం. కానీ ఈ ఉప్మాను తినడానికి చాలా మంది ఇష్టపడరు. క్యారెట్, క్యాప్సికం, బఠాణీ ఏది వేసి చేసిన కూడా ఈ ఉప్మాను చాలా మంది తినరు. ఇంట్లో తినడానికి ఏమి ఉండనప్పుడు, ల్పాహారం తయారు చేసుకోవడానికి సమయం లేనప్పుడు దీనిని తయారు చేసుకుని ఇస్టం లేకపోయిన తింటుంటారు. సరిగ్గా వండాలే కానీ ఉప్మా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను ఇష్టపడని వారు కూడా కింద చెప్పిన విధంగా తయారు చేసిన ఉప్మాను లొట్టలేసుకుంటూ లాగించేస్తారు. చాలా సులభంగా, మరింత రుచిగా ఉప్మాను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఉప్మా తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, నూనె – పావు కప్పు, ఆవాలు – ఒక టీ స్పూన్, శనగపప్పు – 2 టీ స్పూన్స్, మినపప్పు – 2 టీ స్పూన్స్, జీడిపప్పు పలుకులు – 10, కరివేపాకు – రెండు రెమ్మలు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 3, అల్లం తరుగు – ఒక టేబుల్ స్పూన్, నీళ్లు – మూడు కప్పులు, పాలు – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నెయ్యి – పావు కప్పు.
ఉప్మా తయారీ విధానం..
ముందుగా అడుగ భాగం మందంగా ఉండే ఒక కళాయిని తీసుకుని అందులో రవ్వను వేసి వేయించాలి. ఇందులోనే జీలకర్రను కూడా వేసి వేయించాలి. రవ్వను చిన్న మంటపై చక్కటి వాసన వచ్చే వరకు కలుపుతూ వేయించి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఈ రవ్వలో తగినంత ఉప్పును వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత జీడిపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, అల్లం తరుగు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత నీళ్లు, పాలు పోసి వేడి చేయాలి.
పాలు పొంగు వచ్చిన తరువాత ముందుగా సిద్దం చేసుకున్న రవ్వను వేస్తూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. దీనిని రెండు నిమిషాల పాటు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. 5 నిమిషాల తరువాత ఇందులో నెయ్యి వేసి బాగా కలుపుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే ఉప్మా తయారవుతుంది. తరచూ చేసే ఉప్మా కంటే కూడా ఈ విధంగా చేసిన ఉప్మా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఉప్మాను తినడానికి ఇష్టపడని వారు కూడా ఈ విధంగా చేసిన ఉప్మాను ఇష్టంగా తింటారు.