Perugu Vadalu : మనం ఉదయం పూట అల్పాహారంగా రకరకాల వంటలను తయారు చేసుకుని తింటూ ఉంటాం. మనం ఆహారంగా తీసుకునే అల్పాహారాల్లో పెరుగు వడలు ఒకటి. ఇవి మనందరికి తెలిసినవే. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. చక్కగా వండాలే కానీ ఈ పెరుగు వడలు చాలా రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. రుచిగా, సులువుగా ఈ పెరుగు వడలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి… అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెరుగు వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
మినపప్పు – 200 గ్రా., ఉప్పు – తగినంత, పెరుగు – అర లీటర్, నీళ్లు – ఒక గ్లాస్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా. తాళింపు దినుసులు – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెరుగు వడల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో మినపప్పును తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 నుండి 8 గంటల పాటు నానబెట్టాలి. తరువాత మినపప్పును జార్ లో వేసి మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసుకుని తగినంత ఉప్పు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో పెరుగును తీసుకుని ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. తరువాత దీనిలో నీళ్లు, ఉప్పు వేసి కలుపుకోవాలి. తరువాత ఒక కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక తాళింపు దినుసులు, ఎండుమిర్చి వేసి వేయించాలి. తరువాత కరివేపాకు, అల్లం తరుగు వేసి వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న తాళింపును పెరుగులో వేసి కలపాలి.
అలాగే కొత్తిమీరను కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి కొద్దిగా తడిని చేసుకుంటూ పిండిని తీసుకుని వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని పెరుగులో వేసుకోవాలి. వీటిని పది నిమిషాల పాటు పెరుగులో ఉంచి నానిన తరువాత పెరుగుతో కలిపి గిన్నెలోకి తీసుకుని సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెరుగు వడలు తయారవుతాయి. ఉదయం అల్పాహారంగా ఈ పెరుగు వడలను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.