Pesara Ponganalu : పెసర్లు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయన్న సంగతి మనకు తెలిసిందే. జీర్ణశక్తిని మెరుగుపరచడంలో, బరువు తగ్గడంలో, శరీరానికి కావల్సిన పోషకాలను అందించడంలో, శరీరాన్ని బలంగా, ధృడంగా చేయడంలో ఇలా అనేక రకాలుగా పెసర్లు మనకు సహాయపడతాయి. వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని పొందవచ్చు. పెసర్లతో మనం ఎక్కువగా పెసర దోశలను తయారు చేస్తూ ఉంటాము. వీటితో పాటు మనం ఈ పెసర్లతో పొంగనాలను కూడా తయారు చేసుకోవచ్చు. ఈ పెసర పొంగనాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. పెసర్లతో ఎంతో రుచిగా ఉండే పెసర పొంగనాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పొంగనాల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర్లు – 2 కప్పులు, ఉప్పు – తగినంత, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, జీలకర్ర – ఒక టీ స్పూన్.
పెసర పొంగనాల తయారీ విధానం..
ముందుగా పెసర్లను శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు పోసి రాత్రంతా నానబెట్టాలి. తరువాత నానిన ఈ పెసర్లను మరోసారి శుభ్రంగా కడిగి మిక్సీలో లేదా జార్ లో వేసుకోవాలి. తరువాత కొద్దిగా నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పుతో పాటు మిగిలిన పదార్థాలు వేసి కలపాలి. ఇప్పుడు పొంగనాల గిన్నెను తీసుకుని గుంతల్లో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక పిండిని తీసుకుని గుంతల్లో వేసుకోవాలి. తరువాత వీటిపై మూత పెట్టి ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత మరో వైపుకు తిప్పుకుని మరో నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర పొంగనాలు తయారవుతాయి. వీటిని చట్నీతో తింటే చాలా రుచిగా ఉంటాయి. పెసర్లతో తరచూ దోశలే కాకుండా ఇలా పొంగనాలను కూడా తయారు చేసుకుని తినవచ్చు.