Pesara Punugulu : మనకు సాయంత్రం సమయంలో బండ్ల మీద లభించే చిరుతిళ్లల్లో పెసర పునుగులు ఒకటి. వీటిని మనలో చాలా మంది రుచి చూసే ఉంటారు. పెసర పునుగులు చాలా రుచిగా కరకరలాడుతూ ఉంటాయి. చాలా మంది వీటిని ఇష్టంగా తింటారు. అచ్చం బండ్ల మీద లభించే విధంగా ఉండే ఈ పెసర పునుగులను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండే పెసర పునుగులను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర పునుగుల తయారీకి కావల్సిన పదార్థాలు..
పెసర పప్పు – ఒక కప్పు, మినపప్పు – 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు – తగినంత, అల్లం – 2 ఇంచుల ముక్క, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా, జీలకర్ర – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పెసర పునుగుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పెసర పప్పు, మినపప్పును తీసుకుని తగినన్ని నీళ్లు పోసి శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. పప్పు నానిన తరువాత దానిని ఒక జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులోనే అల్లం, ఉప్పు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. తరువాత కళాయిలో నూనె పోసి బాగా వేడి చేయాలి. నూనె వేడయ్యాక చేతికి తడి చేసుకుంటూ తగినంత పిండిని తీసుకుని పునుగుల్లా వేసుకోవాలి. ఈ పునుగులను మధ్యస్థ మంటపై కరకరలాడుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసర పునుగులు తయారవుతాయి. వీటిని అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం పూట స్నాక్స్ గా చేసుకుని తినడానికి ఈ పెసర పునుగులు చాలా చక్కగా ఉంటాయి.