Pesara Vadiyalu : మనం ఆహారంగా తీసుకునే పప్పు దినుసుల్లో పెసరపప్పు కూడా ఒకటి. పెసరపప్పులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. పెసరపప్పుతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. పెసరపప్పుతో ఎక్కువగా పప్పు కూరలు, చారు, గారెలు వంటి వాటిని తయారు చేస్తూ ఉంటారు. ఇవే కాకుండా పెసరపప్పుతో మనం ఎంతో రుచిగా ఉండే వడియాలను కూడా తయారు చేసుకోవచ్చు. పెసర వడియాలు చాలా రుచిగా ఉంటాయి. ఎవరైనా వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. పెసరపప్పుతో రుచిగా వడియాలను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పెసర వడియాల తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు పెసరపప్పు – పావు కిలో, పచ్చిమిర్చి – 8, ఉప్పు – తగినంత, నూనె డీప్ ఫ్రైకు సరిపడా.
పెసర వడియాల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పొట్టు పెసరపప్పును తీసుకోవాలి. ఇందులో తగినన్ని నీళ్లు పోసి 3 గంటల పాటు నానబెట్టాలి. తరువాత ఈ పప్పును శుభ్రంగా కడిగి నీరంతా పూర్తిగా పోయేలా వడకట్టుకోవాలి. తరువాత ఈ పప్పును గ్రైండర్ లో వేసి మెత్తగా రుబ్బుకుని గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఒక జార్ లో పచ్చిమిర్చి, ఉప్పు వేసి బరకగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని పెసరపప్పు మిశ్రమంలో వేసి కలపాలి. తరువాత ఒక ప్లాస్టిక్ కవర్ పై కొద్ది కొద్దిగా పిండిని తీసుకుంటూ చిన్న చిన్న వడియాలుగా పెట్టుకోవాలి. వీటిని రెండు నుండి మూడు రోజుల పాటు ఎండలో ఉంచి బాగా ఎండబెట్టుకోవాలి.
ఇలా చేయడం వల్ల పెసర వడియాలు తయారవుతాయి. ఈ వడియాలను గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల సంవత్సరమంతా తాజాగా ఉంటాయి. ఇప్పుడు కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వడియాలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. పప్పు, చారు, రసం, సాంబార్ వంటి వాటితో ఈ వడియాలను తింటే చాలా రుచిగా ఉంటాయి. బయట కొనుగోలు చేసే పని లేకుండా పెసరపప్పుతో ఇంట్లోనే ఇలా వడియాలను తయారు చేసుకుని తినవచ్చు.