Pesarapappu Pakoda : మనం సాయంత్రం సమయాల్లో రకరకాల స్నాక్స్ ను తయారు చేస్తూ ఉంటాం. వేసవికాలంలో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కనుక ఎప్పుడూ ఏదో ఒకటి తినడానికి అడుగుతూనే ఉంటారు. అలాంటి సమయంలో పెసరపప్పుతో పకోడీలను చేసి పెట్టడం వల్ల పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఈ పకోడీలు రుచిగా, కరకరలాడుతూ చాలా చక్కగా ఉంటాయి. వీటిని 20 నిమిషాల్లోనే మనం సులభంగా తయారు చేసుకోవచ్చు. రుచిగా, కరకరలాడుతూ ఉండే పెసరపప్పు పకోడీలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పెసరపప్పు పకోడీల తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3, పెసరపప్పు – ఒక కప్పు, బియ్యం పిండి – 2 టేబుల్ స్పూన్స్, పసుపు – చిటికెడు, కారం – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, చాట్ మసాలా – అర టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కరివేపాకు – రెండు రెమ్మలు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పెసరపప్పు పకోడీల తయారీ విధానం..
ముందుగా పెసరపప్పులో వేడి నీటిని పోసి అర గంట పాటు నానబెట్టుకోవాలి. తరువాత ఈ పప్పును నీళ్లు లేకుండా చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో ఉడికించిన బంగాళాదుంపలను మెత్తగా చేసి వేసుకోవాలి. తరువాత నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. పిండి పలుచగా అయితే కొద్దిగా బియ్యం పిండిని వేసి కలుపుకోవచ్చు. తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా పెసరపప్పు మిశ్రమాన్ని తీసుకుంటూ పకోడీల వలె వేసుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడుతూ ఎర్రగా అయ్యే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పెసరపప్పు పకోడీలు తయారవుతాయి. వీటిని వేడి వేడిగా టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ తినాలనిపించినప్పుడు, ఇంటికి అతిథులు వచ్చినప్పుడు ఇలా అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే స్నాక్స్ ను తయారు చేసి పెట్టవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.