Pootharekulu : పూత రేకులు.. ఇవి తెలియని.. వీటిని రుచి చూడని వారు ఉండరనే చెప్పవచ్చు. పూత రేకులు చాలా రుచిగా ఉంటాయి. మనకు స్వీట్ షాపుల్లో ఇవి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. పూత రేకులను కుండపై, కట్టెల పొయ్యి మీద తయారు చేస్తారు. చాలా మంది వీటిని మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి వీలు కాదని భావిస్తూ ఉంటారు. కానీ ఎంతో రుచిగా ఉండే పంచదార పూతరేకులను మనం ఇంట్లోనే చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. కుండ, కట్టెల పొయ్యి లేకుండా పంచదార పూతరేకులను ఇంట్లో ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పంచదార పూత రేకుల తయారీకి కావల్సిన పదార్థాలు..
రేషన్ బియ్యం – ఒక గ్లాస్, పంచదార – ఒక కప్పు, జీడిపప్పు – అర కప్పు, బాదం పప్పు – అర కప్పు, పిస్తా పప్పు – అర కప్పు, యాలకులు – 3, నెయ్యి – అర కప్పు.
పంచదార పూత రేకుల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బియ్యాన్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి 6 గంటల పాటు నానబెట్టుకోవాలి. తరువాత బియ్యాన్ని ఒక జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఈ పిండిని వెడల్పుగా ఉండే ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో తగినన్ని నీళ్లు పోసి పిండిని పలుచగా చేసుకోవాలి. తరువాత ఒక కాటన్ వస్త్రాన్ని రెండు మడతలు వేసి నీటిలో నానబెట్టుకోవాలి. తరువాత నీటిని పిండిని పిండిలో ముంచాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. మనం కుండ మీద కాటన్ వస్త్రాన్ని వేసి ఎలా అయితే పూతరేకును తయారు చేస్తామో అదే విధంగా పెనం మీద కాటన్ వస్త్రాన్నివేసి పూతరేకును తయారు చేసుకోవాలి. పిండిలో ముంచిన కాటన్ వస్త్రాన్ని పెనం మీద వేసి వెంటనే కిందికి లాగాలి. తరువాత ఈ పూత రేకును పెద్ద మంటపై పెనం నుండి వేరయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత ఒక జార్ లో పంచదార, యాలకులు వేసి మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత డ్రై ఫ్రూట్స్ ను ఒక్కొక్కటిగా మిక్సీ పట్టుకుని గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ముందుగా తయారు చేసిన పూత రేకును తీసుకుని చేతికి తడి చేసుకుంటూ పూత రేకుపై నెమ్మదిగా అద్దాలి.ఇలా చేయడం వల్ల పూత రేకు విరిగి పోకుండా ఉంటుంది. తరువాత పంచదార పొడి, డ్రై ఫ్రూట్స్ పొడులను ఒక్కొక్కటిగా పూత రేకుపై చల్లుకోవాలి. తరువాత నెయ్యి వేసుకోవాలి. తరువాత దీనిపై మరో పూతరేకును ఉంచి అలాగే పంచదార పొడులను, డ్రై ఫ్రూట్స్ పొడులను చల్లుకోవాలి. తరువాత నెయ్యిని చల్లుకోవాలి. తరువాత వీటిని మనకు కావల్సిన ఆకారంలో మడుచుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పంచదార పూత రేకులు తయారవుతాయి. పండుగలకు బయట కొనుగోలు చేసే పని లేకుండా ఇలా ఇంట్లోనే పంచదార పూతరేకులను తయారు చేసుకుని తినవచ్చు.