వర్షాకాలంలో వాతావరణం ఎంతో చల్లగా ఉంటుంది. ఇలాంటి చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడిగా తినాలనిపిస్తుంది. ఇలాంటి సమయాన్ని పొటాటో పన్నీర్ చిల్లీ పకోడాతో ఆస్వాదిస్తే ఆ మజానే వేరేగా ఉంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం పొటాటో పన్నీర్ చిల్లీ పకోడా ఎలా తయారు చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.
కావలసిన పదార్థాలు
పొటాటో 3, పచ్చిమిర్చి మిశ్రమం ఒక కప్పు, పన్నీర్ తురుము అర కప్పు, శనగపిండి అర కప్పు, బియ్యం పిండి 3 టేబుల్ స్పూన్లు, కారం టేబుల్ స్పూన్, బేకింగ్ సోడా చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర తురుము కొద్దిగా, కరివేపాకు రెమ్మ, నూనె డీప్ ఫ్రైకి సరిపడినంత.
తయారీ విధానం
ముందుగా బంగాళాదుంపలను ఉడికించుకొని మెత్తని మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నెలో కి బంగాళాదుంపల మిశ్రమాన్ని, పచ్చిమిర్చి మిశ్రమం, శెనగపిండి, బియ్యం పిండి వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమంలోకి పన్నీర్ తురుము, కారం, తగినంత ఉప్పు, చిటికెడు బేకింగ్ సోడా, కరివేపాకు, కొత్తిమిర వేసి మరోసారి బాగా కలుపుకోవాలి. అవసరం అనుకుంటే ఇందులోకి కొద్దిగా నీరు వేసి బాగా కలుపుకోవాలి.
ఇప్పుడు స్టవ్ మీద కడాయి ఉంచి డీప్ ఫ్రై కి సరిపడా నూనె వేసి వేడి చేయాలి. నూనె బాగా వేడి అయిన తరువాత ఈ మిశ్రమాన్ని పకోడీల మాదిరిగా వేసుకుని బాగా ఎరుపు రంగులోకి వచ్చిన తర్వాత తీసేయాలి. ఈ విధంగా వేడి వేడిగా ఉన్న పొటాటో పన్నీర్ చిల్లీ పకోడీ లను టమోటో కెచప్ తో తింటే ఎంతో అద్భుతమైన రుచిని కలిగి ఉంటాయి.