Potato Semolina Cutlets : మనం బంగాళాదుంపలతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బంగాళాదుంపతో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. బంగాళాదుంపలతో చేసుకోదగిన రుచికరమైన చిరుతిళ్లల్లో పొటాటో రవ్వ కట్లెట్ లు కూడా ఒకటి. ఇవి పైన కరకరలాడుతూ లోపల మెత్తగా చాలా రుచిగా ఉంటాయి. సాయంత్రం సమయాల్లో స్నాక్స్ గా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. వీటిని కేవలం 15 నిమిషాల్లోనే తయారు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పొటాటో రవ్వ కట్లెట్ లను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొటాటో రవ్వ కట్లెట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించిన బంగాళాదుంపలు – 3( మధ్యస్థంగా ఉన్నవి), తరిగిన ఉల్లిపాయ – 1, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, జీలకర్ర – అర టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, బొంబాయి రవ్వ – 4 టీ స్పూన్స్, ఉప్పు – తగినంత, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
పొటాటో రవ్వ కట్లెట్ తయారీ విధానం..
ముందుగా ఉడికించిన బంగాళాదుంపలను ఉండలు లేకుండా మెత్తగా చేసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి బాగా కలుపుకోవాలి. తరువాత చేతులకు నూనె రాసుకుంటూ కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ కట్లెట్ ల ఆకారంలో వత్తుకోవాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక వత్తుకున్న కట్లెట్ లను వేసి వేయించాలి. వీటిని మధ్యస్థ మంటపై రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొటాటో రవ్వ కట్లెట్ లు తయారవుతాయి. వీటిని టమాట కిచప్ తో కలిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. ఈ విధంగా సాయంత్రం సమయాల్లో అప్పటికప్పుడు ఎంతో రుచిగా ఉండే కట్లెట్ లను తయారు చేసుకుని తినవచ్చు. వీటిని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.