Potlam Paratha : పొట్లం పరాటా.. గోధుమపిండితో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉంటాయి. స్నాక్స్ గా లేదా అల్పాహారంగా తీసుకోవడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పరాటాలను తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. వీటిని తయారు చేయడం చాలా సులభం. తరుచూ ఆలూ పరాటా, గోబి పరాటా కాకుండా ఇలా వెరైటీగా కూడా తయారు చేసుకుని తినవచ్చు. రుచితో పాటు ఆరోగ్యాన్ని అందించే పొట్లం పరాటాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
పొట్లం పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – చిటికెడు, నూనె – ఒక టీ స్పూన్, సన్నగా పొడవుగా తరిగిన ఉల్లిపాయ – 1, క్యారెట్ తురుము – పావు కప్పు, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, ఉడికించిన కోడిగుడ్లు – 2, చిల్లీ ప్లేక్స్ – అర టీ స్పూన్, గరం మసాలా – పావు టీ స్పూన్, ఆమ్ చూర్ పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – అర టీ స్పూన్.
పొట్లం పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో పిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నూనె వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 10 నిమిషాల పాటు పిండిని నాననివ్వాలి. తరువాత ఒక గిన్నెలో ఉడికించిన కోడిగుడ్లను సన్నగా తురిమి వేసుకోవాలి. ఇక్కడ కోడిగుడ్లకు బదులుగా ఉడికించిన బంగాళాదుంపలను లేదా పనీర్ ను కూడా వాడుకోవచ్చు. తరువాత ఈ గిన్నెలో ఉల్లిపాయ ముక్కలతో పాటు మిగిలిన పదార్థాలన్నీ వేసి బాగా కలపాలి. ఇప్పుడు పిండిని మరోసారి కలుపుకుని చిన్న ఉండను తీసుకుని పొడి పిండి చల్లుకుంటూ వీలైనంత పలుచగా రుద్దుకోవాలి. తరువాత దీనిపై నెయ్యి లేదా నూనె వేసి చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. తరువాత దీనిని ఒక చివరి నుండి మొదలు పెట్టి రోల్ లాగా మధ్యలో గ్యాప్ లేకుండా చుట్టుకోవాలి.
దీనిని మరలా చపాతీ ముద్దలాగా చేసి మరలా పిండి చల్లుకుంటూ చపాతీలా వత్తుకోవాలి. తరువాత ఇందులో ఉల్లిపాయ మిశ్రమాన్ని ఉంచి అంచులకు తడి చేసుకోవాలి. దీనిని చతురస్రాకారం వచ్చేలా అంచులను మూసి వేయాలి. ఇలా తయారు చేసుకున్న పరోటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కొద్దిగా కాల్చుకోవాలి. తరువాత నూనె వేస్తూ కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పొట్లం పరాటా తయారవుతుంది. దీనిని నేరుగా తిన్నా కూడా చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా పొట్లం పరాటాను తయారు చేసి తీసుకోవడం వల్ల మనం రుచితో పాటు ఆరోగ్యాన్ని కూడా పొందవచ్చు.