Prawns 65 : మనం ఆహారంగా తీసుకునే సముద్రపు ఆహారాల్లో రొయ్యలు కూడా ఒకటి. వీటిని చాలా మంది ఎంతో ఇష్టంగా తింటారు. రొయ్యలను తినడం వల్ల మనం అనేక ఆరోగ్యకరమైన ప్రయోజనాలను పొందవచ్చు. రొయ్యలతో చేసే ఎటువంటి వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. అందులో భాగంగా రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే ప్రాన్స్ 65 ని ఇంట్లో ఏవిధంగా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాన్స్ 65 తయారీకి కావల్సిన పదార్థాలు..
పొట్టు తీసిన రొయ్యలు – అర కిలో, ఉప్పు – తగినంత, పసుపు – పావు టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్, నిమ్మరసం – ఒక టీస్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, మిరియాల పొడి – అర టీ స్పూన్, గరం మసాలా పొడి – అర టీ స్పూన్, కార్న్ ఫ్లోర్ – ఒక టేబుల్ స్పూన్, బియ్యం పిండి – అర టేబుల్ స్పూన్, నూనె – డీప్ ఫ్రై కి సరిపడా, జీలకర్ర – ఒక టీ స్పూన్, బిర్యానీ ఆకు – 1, తరిగిన పచ్చిమిర్చి – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, సన్నగా తరిగిన కొత్తిమీర – కొద్దిగా, సన్నగా తరిగిన పుదీనా – కొద్దిగా.
ప్రాన్స్ 65 తయారీ విధానం..
ముందుగా రొయ్యలను ఉప్పు, నిమ్మరసం వేసి బాగా శుభ్రపరిచి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో ఉప్పు, పసుపు, అల్లం పేస్ట్, నిమ్మరసం, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, గరం మసాలా, కార్న్ ఫ్లోర్, బియ్యం పిండి వేసి అన్నీ కలిసేలా బాగా కలపాలి. తరువాత ఈ రొయ్యలను అర గంట పాటు ఫ్రిజ్ లో ఉంచి మారినేట్ చేయాలి. తరువాత కళాయిలో నూనె పోసి నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా రొయ్యలను వేసి వేయించుకోవాలి. వీటిని మధ్యస్థ మంటపై కరకరలాడే వరకు వేయించుకుని టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి.
ఇలా అన్నీ రొయ్యలను వేయించుకున్న తరువాత కళాయిలో ఒక టేబుల్ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర, బిర్యానీ ఆకు, పచ్చిమిర్చి వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలను వేసి ఎర్రగా అయ్యే వరకు వేయించుకోవాలి. తరువాత ముందుగా వేయించిన రొయ్యలను వేసి కలుపుతూ 3 నిమిషాల పాటు వేయించాలి. చివరగా కొత్తిమీర, పుదీనా వేసి ఒక నిమిషం పాటు వేయించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల అచ్చం రెస్టారెంట్ లలో లభించే విధంగా ఉండే ప్రాన్స్ 65 తయారవుతుంది. దీనిని అందరూ ఎంతో ఇష్గంగా తింటారు. రొయ్యలతో తరచూ చేసే వంటకాలకు బదులుగా ఇలా కూడా చేసుకుని తినవచ్చు.