Prawns Masala : మనం ఆహారంగా తీసుకునే సీ ఫుడ్ లో రొయ్యలు కూడా ఒకటి. రొయ్యల్లో కూడా మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంగా తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. రొయ్యలతో రకరకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాము. రొయ్యలతో చేసే వంటకాలు రుచిగా ఉండడంతో పాటు వీటిని సులభంగా తయారు చేసుకోవచ్చు. అందులో భాగంగా రొయ్యలతో ఎంతో రుచిగా ఉండే మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ప్రాన్స్ మసాలా కర్రీ తయారీకి కావల్సిన పదార్థాలు..
రొయ్యలు – 250 గ్రా., పచ్చిమిర్చి – 4, తరిగిన పెద్ద ఉల్లిపాయ – 1, అల్లం – ఒక ఇంచు ముక్క, వెల్లుల్లి రెబ్బలు – 7, నూనె – అర కప్పు, కరివేపాకు రెండు రెమ్మలు, కారం – ఒక టేబుల్ స్పూన్, ధనియాల పొడి – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – పావు లీటర్, గరం మసాలా – అర టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – అర కట్ట.
ప్రాన్ప్ మసాలా కర్రీ తయారీ విధానం..
ముందుగా రొయ్యలను చక్కగా శుభ్రం చేసుకోవాలి. తరువాత పసుపు, ఉప్పు వేసి కలపాలి. తరువాత దీనిని ఫ్రిజ్ లో ఉంచి గంట పాటు మ్యారినేట్ చేసుకోవాలి. తరువాత ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలు, అల్లం, వెల్లుల్లి రెబ్బలు, పచ్చిమిర్చి, కొద్దిగా నీళ్లు పోసి మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక రొయ్యలను వేసి వేయించాలి. వీటిని 50 శాతం వరకు వేయించిన తరువాత ఒక ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత ఇదే కళాయిలో మరో 3 టేబుల్ స్పూన్ల నూనె వేసి వేడి చేయాలి. తరువాత కరివేపాకు వేసి వేయించాలి. తరువాత మిక్సీ పట్టుకున్న పేస్ట్ వేసి కలపాలి.
దీనిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించిన తరువాత ఉప్పు, కారం, ధనియాల పొడి , జీలకర్ర పొడి వేసి కలపాలి. తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత వేయించిన రొయ్యలు వేసి కలపాలి. ఇప్పుడు దీనిపై మూత పెట్టి కూర దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత గరం మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రొయ్యల మసాలా కర్రీ తయారవుతుంది. దీనిని అన్నంతోకలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా తయారు చేసిన మసాలా కర్రీని అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.