Punjabi Gobi Paratha : మనం అల్పాహారంగా తీసుకునే వాటిలో పరాటాలు కూడా ఒకటి. గోధుమపిండితో చేసే ఈ పరాటాలు చాలా రుచిగా ఉండడంతో పాటు వీటిని తీసుకోవడం వల్ల మన ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది. మనం వివిధ రుచుల్లో ఈ పరాటాలను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన రుచికరమైన పరాటాలల్లో గోబి పరాటా కూడా ఒకటి. క్యాలీప్లవర్ తో చేసే పరాటాలు మెత్తగా తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉంటాయి. వీటిని తయారు చేయడం కూడా చాలా సులభం. అల్పాహారంగా తినడానికి ఇవి చాలా చక్కగా ఉంటాయి. ఈ పరాటాలను ఒక్కటి తింటే చాలు కడుపు నిండిన భావన కలుగుతుంది. ఎంతో రుచిగా ఉండే ఈ పంబాజి గోబి పరాటాలను ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పంజాబి గోబి పరాటా తయారీకి కావల్సిన పదార్థాలు..
గోధుమపిండి – ఒక కప్పు, ఉప్పు – తగినంత, నెయ్యి- ఒక టీ స్పూన్, సన్నగా తురిమిన క్యాలీప్లవర్ – 100 గ్రా., చాట్ మసాలా – అర టీ స్పూన్, తరిగిన వెల్లుల్లి రెబ్బలు – 3, కారం – అర టీస్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, అల్లం తరుగు – ఒక టీ స్పూన్, నిమ్మరసం – అర చెక్క.
పంజాబి గోబి పరాటా తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో గోధుమపిండిని తీసుకోవాలి. తరువాత ఇందులో ఉప్పు, నెయ్యి వేసి బాగా కలపాలి. తరువాత నీటిని పోస్తూ పిండిని మెత్తగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి అరగంట పాటు పిండిని నానబెట్టుకోవాలి. తరువాత క్యాలీప్లవర్ తురుమును ఒక వస్త్రంలో వేసి నీరంతా పోయేలా గట్టిగా పిండి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత ఇందులో మిగిలిన పదార్థాలన్నీ వేసి కలుపుకోవాలి. ఇప్పుడు పిండిని సమానంగా ఉండలుగా చేసుకోవాలి. తరువాత ఒక్కో ఉండను తీసుకుంటూ ముందుగా చేత్తో వెడల్పుగా వత్తుకోవాలి.
తరువాత ఇందులో 2 టేబుల్ స్పూన్ల క్యాలీప్లవర్ మిశ్రమాన్ని ఉంచి అంచులను మూసి వేయాలి. తరువాత పొడి పిండి చల్లుకుంటూ మందంగా పరోటాలా వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న పరాటాను వేడి వేడి పెనం మీద వేసి ముందుగా రెండు వైపులా కాల్చుకోవాలి. తరువాత నూనె లేదా బటర్ వేసి మధ్యస్థ మంటపై రెండు వైపులా చక్కగా కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పంబాజి గోబి పరాటాలు తయారవుతాయి. వీటిని ఆవకాయ, రైతాతో తింటే చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా తీసుకోవడంతో పాటు లంచ్ బాక్స్ లోకి కూడా ఈ పరాటాలు చాలా చక్కగా ఉంటాయి.