Sponge Bread Dosa : మనం బ్రెడ్ ను కూడా ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉంటాము. దీనితో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బ్రెడ్ తో చేసే చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు వీటిని చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. అయితే తరుచూ ఒకేరకమైన చిరుతిళ్లు కాకుండా బ్రెడ్ తో వెరైటీగా మనం దోశలను కూడా తయారు చేసుకోవచ్చు. బ్రెడ్ తో చేసే ఈ దోశలు మెత్తగా, చాలా రుచిగా ఉంటాయి. ఈ దోశలను తయారు చేసుకోవడానికి పప్పు నానబెట్టి, రుబ్బే పనే ఉండదు. అలాగే ఇన్ స్టాంట్ గా 5 నిమిషాల్లో వీటిని తయారు చేసుకోవచ్చు. ఉదయం పూట సమయం తక్కువగా ఉన్నవారికి ఇవి చక్కటి బ్రేక్ ఫాస్ట్ అని చెప్పవచ్చు. బ్రెడ్ తో రుచిగా, ఇన్ స్టాంట్ గా బ్రెడ్ దోశలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
బ్రెడ్ దోశ తయారీకి కావల్సిన పదార్థాలు..
బ్రౌన్ రెడ్ – 8 స్లైసెస్, బొంబాయి రవ్వ -అర కప్పు, బియ్యంపిండి – ఒక టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, పెరుగు – 2 టేబుల్ స్పూన్స్, నూనె – ఒక టేబుల్ స్పూన్, ఆవాలు – అర టీ స్పూన్, మినపప్పు – అర టీ స్పూన్, తరిగిన అల్లం – అర ఇంచు ముక్క, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 1, తరిగిన కరివేపాకు – ఒక రెమ్మ, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1.
బ్రెడ్ దోశ తయారీ విధానం..
ముందుగా బ్రెడ్ కు ఉండే అంచులను తీసేసి అవి మునిగే వరకు నీటిని పోసి నానబెట్టుకోవాలి. తరువాత ఒక గిన్నెలో రవ్వ, బియ్యం పిండి, ఉప్పు వేసి కలపాలి. తరువాత తగినన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి. ఇప్పుడు నానబెట్టిన బ్రెడ్ లో ఉండే నీటిని పిండేసి జార్ లోకి తీసుకోవాలి. తరువాత ఇందులో పెరుగు, తగినన్ని నీళ్లు పోసి మెత్తగా మిక్సీ పట్టుకుని రవ్వ మిశ్రమంలో వేసి కలుసుకోవాలి. తరువాత కళాయిలో తాళింపుకు నూనె వేసి వేడి చేయాలి. తరువాత మిగిలిన పదార్థాలను ఒక్కొక్కటిగా వేసి వేయించాలి. తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని పిండిలో వేసి కలపాలి. అవసరమైతే తగినన్ని నీళ్లు పోసుకుని దోశ పిండిలా కలుపుకోవాలి.
తరువాత స్టవ్ మీద పెనాని ఉంచి వేడి చేయాలి. పెనం వేడయ్యాక పిండిని తీసుకుని దోశ లాగా వేసుకోవాలి. ఈ దోశ మామూలు దోశల వలె పలుచగా రాదు. దీనిపై నూనె వేసుకుని మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే బ్రెడ్ దోశ తయారవుతుంది. దీనిని అల్లం చట్నీతో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఎప్పుడూ ఒకేరకం దోశలు కాకుండా ఇలా వెరైటీగా అప్పటికిప్పుడు బ్రెడ్ తో కూడా రుచికరమైన దోశలను తయారు చేసుకుని తినవచ్చు. ఈ దోశలను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.