Puri Sagu : పూరీ సాగు.. మనకు నార్త్ ఇండియా రెస్టారెంట్ లలో, ధాబాలలో పూరీలతో ఈ కర్రీని సర్వ్ చేస్తూ ఉంటారు. పూరీ సాగు చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీని మనం ఇంట్లో కూడా చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ కర్రీని కూడా అందరూ ఇష్టంగా తింటారని చెప్పవచ్చు. వెరైటీగా తినాలనుకునే వారు ఇలా పూరీ సాగును తయారు చేసుకుని తినవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ పూరీ సాగును ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
పూరీ సాగు తయారీకి కావల్సిన పదార్థాలు..
ఉడికించి పెద్ద ముక్కలుగా తరిగిన బంగాళాదుంపలు – 2, తరిగిన టమాటాలు – 2, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, పెటల్స్ లాగా తరిగిన ఉల్లిపాయ – 1, నూనె – 2 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 3, దాల్చిన చెక్క – 2 ఇంచుల ముక్క, జీలకర్ర – అర టీ స్పూన్, సోంపు గింజలు – అర టీ స్పూన్, ఉప్పు – తగినంత, కారం – ఒక టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, నీళ్లు – ఒకటిన్నర గ్లాస్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
పూరీ సాగు తయారీ విధానం..
ముందుగా కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. తరువాత లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, సోంపు గింజలు వేసి వేయించాలి. ఇవి వేగిన తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. ఇవి కొద్దిగా వేగిన తరువాత పెటల్స్ లాగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. తరువాత టమాట ముక్కలు వేసి మెత్తబడే వరకు ఉడికించాలి. టమాట ముక్కలు ఉడికిన తరువాత ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. వీటిని ఒక నిమిషం పాటు వేయించిన తరువాత నీళ్లు పోసి కలపాలి. తరువాత బంగాళాదుంప ముక్కలు వేసి కలిపి మూత పెట్టి మరో 4 నిమిషాల పాటు ఉడికించి కొత్తిమీర చల్లుకుని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే పూరీ సాగు తయారవుతుంది. దీనిని పూరీ, చపాతీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటుంది. తరుచూ చేసే పూరీ కూరలతో పాటు అప్పుడప్పుడూ ఇలా పూరీ సాగును కూడా తయారు చేసుకుని తినవచ్చు.