Kakarakaya Nilva Pachadi : మనం వంటింట్లో రకరకాల నిల్వ పచ్చళ్లను తయారు చేస్తూ ఉంటాము. మనం సులభంగా చేసుకోదగిన నిల్వ పచ్చళ్లల్లో కాకరకాయ నిల్వ పచ్చడి కూడా ఒకటి. ఈ పచ్చడి చాలా కమ్మగా, రుచిగా ఉంటుంది. అలాగే దీనిని ఒక్కసారి తయారు చేసి పెట్టుకుంటే 6 నెలల నుండి సంవత్సరం పాటు తినవచ్చు. ఎటువంటి కూరలు లేకున్నా ఈ పచ్చడితో కడుపు నిండా భోజనం చేయవచ్చు. మొదటిసారి చేసే వారు కూడా ఇలా కింద చెప్పిన విధంగా చేయడం వల్ల ఎంతో కమ్మగా ఉండే కాకరకాయ పచ్చడిని తయారు చేసుకోవచ్చు. తిన్నా కొద్ది తినాలనిపించేంత రుచిగా ఉండే ఈ కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
కాకరకాయ నిల్వ పచ్చడి తయారీకి కావల్సిన పదార్థాలు..
కాకరకాయలు – అరకిలో, నానబెట్టిన చింతపండు – 100 గ్రా., ఆవాలు – ఒక టేబుల్ స్పూన్, జీలకర్ర – అర టేబుల్ స్పూన్, మెంతులు -అర టేబుల్ స్పూన్, నూనె – ఒక కప్పు, దంచిన వెల్లుల్లి రెబ్బలు – 20, కరివేపాకు – 3 రెమ్మలు, ఎండుమిర్చి – 7, పసుపు – అర టీ స్పూన్, కారం – ముప్పావు కప్పు, ఉప్పు – పావు కప్పు.
కాకరకాయ నిల్వ పచ్చడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ఆవాలు, జీలకర్ర, మెంతులు వేసి వేయించాలి. తరువాత వీటిని జార్ లోకి తీసుకుని మెత్తని పొడిగా చేసుకోవాలి. తరువాత కళాయిలో చింతపండు పులుసు వేసి నీరంతా పోయి చిక్కబడే వరకు ఉడికించి పక్కకు ఉంచాలి. తరువాత కాకరకాయలపై ఉండే చెక్కును తీసేసి గుండ్రటి ముక్కలుగా కట్ చేసుకోవాలి. తరువాత కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కాకరకాయ ముక్కలను వేసి వేయించాలి. వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించి గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అదే నూనెలో జీలకర్ర, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి తాళింపు చేసుకోవాలి.
తాళింపు వేగిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వాలి. ఇప్పుడు కాకరకాయ ముక్కలల్లో ఉప్పు, కారం, పసుపు, మిక్సీ పట్టుకున్న ఆవాల పిండి వేసి కలపాలి. తరువాత చింతపండు గుజ్జు వేసి కలపాలి. ఇప్పుడు చల్లారిన తాళింపు వేసి కలపాలి. ఈ పచ్చడిని గాజు సీసాలో వేసి రెండు రోజుల తరువాత సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే కాకరకాయ నిల్వ పచ్చడి తయారవుతుంది. కాకరకాయలను తినని వారు కూడా ఈ పచ్చడిని ఇష్టంగా తింటారు.