Ragi Idli : రాగి ఇడ్లీల‌ను త‌యారు చేయ‌డం ఇలా.. ఎంతో బ‌లం, ఆరోగ్య‌క‌రం..

Ragi Idli : మ‌న‌కు విరివిరిగా, చ‌వ‌క‌గా ల‌భించే చిరుధాన్యాల్లో రాగులు కూడా ఒక‌టి. ప్ర‌స్తుత కాలంలో ఈ రాగుల వాడ‌కం రోజురోజుకీ ఎక్కువ‌వుతుంద‌నే చెప్ప‌వ‌చ్చు. రాగుల‌ను ఆహారంగా తీసుకోవ‌డం వ‌ల్ల మ‌నం ఎన్నో ఆరోగ్య‌క‌ర‌మైన ప్ర‌యోజ‌నాల‌ను పొంద‌వ‌చ్చు. రాగిపిండితో మ‌నం ఎక్కువ‌గా రాగి జావ‌ను త‌యారు చేస్తూ ఉంటాం. రాగి జావ‌నే కాకుండా రాగి పిండితో మ‌నం ఇత‌ర ఆహార ప‌దార్థాల‌ను కూడా తయారు చేసుకోవ‌చ్చు. అందులో భాగంగా రాగి పిండితో ఇడ్లీల‌ను ఎలా త‌యారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

రాగి ఇడ్లీ త‌యారీకి కావ‌ల్సిన ప‌దార్థాలు..

మిన‌ప ప‌ప్పు – ఒక క‌ప్పు, రాగులు – ఒక‌టిన్న‌ర క‌ప్పు, ఇడ్లీ బియ్యం – ఒక క‌ప్పు, మెంతులు – ఒక టీ స్పూన్, అటుకులు – అర క‌ప్పు, ఉప్పు – త‌గినంత‌.

Ragi Idli recipe is here very easy to make
Ragi Idli

రాగి ఇడ్లీ త‌యారీ విధానం..

ముందుగా ఒక గిన్నెలో మిన‌ప ప‌ప్పు, రాగులు, ఇడ్లీ బియ్యం, మెంతులు వేసి బాగా క‌డ‌గాలి. త‌రువాత అందులో త‌గిన‌న్ని నీటిని పోసి 4 నుండి 6 గంట‌ల పాటు నాన‌బెట్టాలి. అలాగే అటుకుల‌ను కూడా పిండి ప‌ట్ట‌డానికి అర‌గంట ముందు ఒక గిన్నెలో వేసి నీళ్లు పోసి నాన‌బెట్టాలి. త‌రువాత వీటిని జార్ లో వేసి త‌గిన‌న్ని నీళ్లు పోస్తూ మెత్త‌గా మిక్సీ పట్టుకుని పిండిని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఈ పిండిపై మూత‌ను ఉంచి 8 గంట‌లు లేదా ఒక రాత్రంతా పులియ‌బెట్టాలి. త‌రువాత ఈ పిండిలో త‌గినంత ఉప్పును వేసి బాగా క‌ల‌పాలి. ఇప్పుడు స్ట‌వ్ మీద ఇడ్లీ పాత్ర‌ను ఉంచి అందులో నీటిని పోసి మూత పెట్టి వేడి చేయాలి.

నీళ్లు వేడ‌య్యాక ఇడ్లీ ప్లేట్ ల‌లో పిండిని వేసి ఇడ్లీ పాత్రలో ఉంచి మూత పెట్టి 15 నిమిషాల పాటు ఉడికించాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల మెత్త‌గా, రుచిగా, ఆరోగ్యానికి మేలు చేసే రాగి ఇడ్లీలు త‌యార‌వుతాయి. ఈ ఇడ్లీల త‌యారీలో ఇడ్లీ బియ్యానికి బ‌దులుగా ఇడ్లీ ర‌వ్వ‌ను కూడా ఉప‌యోగించ‌వ‌చ్చు. ఇదే పిండిలో కొద్దిగా నీటిని వేసి ప‌లుచ‌గా చేసుకుని దోశ‌లుగా కూడా చేసుకోవ‌చ్చు. ఈ రాగి ఇడ్లీల‌ను ప‌ల్లి చ‌ట్నీ, అల్లం చ‌ట్నీ, పుట్నాల చ‌ట్నీ వంటి వాటితో క‌లిపి తింటే చాలా రుచిగా ఉంటాయి. అంతేకాకుండా వీటిని తిన‌డం వ‌ల్ల ఆరోగ్యానికి కూడా మేలు క‌లుగుతుంది.

Share
D

Recent Posts