Turmeric For Piles : మన పోపుల పెట్టెలో ఉండే పదార్థాల్లో పసుపు కూడా ఒకటి. ఎంతోకాలంగా పసుపును మనం వంటల్లో ఉనయోగిస్తూ ఉన్నాం. పసుపులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయన్న సంగతి మనందరికీ తెలిసిందే. పసుపుతో మన ఆరోగ్యంతోపాటు అందాన్ని కూడా మెరుగుపరుచుకోవచ్చని అనేక పరిశోధనల్లో వెల్లడైంది. తరచూ పసుపును వాడడం వల్ల అనేక అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటాం. పసుపును ఉపయోగించడం వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మనం వంటల్లో ఉపయోగించే ముఖ్యమైన దినుసుల్లో పసుపు ఒకటి.
పసుపులో యాంటీ ఇన్ ప్లామేటరీ, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఒక గ్లాస్ నీటిలో ఒక టీ స్పూన్ పసుపును వేసి కలపాలి. ఇలా పసుపు కలిపిన నీటిని రోజూ ఉదయం పరగడుపున తాగడం వల్ల ప్రేగుల్లో ఉండే హానికారక బ్యాక్టీరియా నశిస్తుంది. దంత సమస్యలను తగ్గించే గుణం కూడా పసుపుకు ఉంది. ఒక గిన్నెలో పసుపును, ఉప్పును వేసి కలపాలి. తరువాత ఇందులో కొద్దిగా నీటిని వేసి పేస్ట్ లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని బ్రష్ తో కానీ, వేలితో కానీ తీసుకుని దంతాలను శుభ్రపరుచుకోవాలి. ఇలా చేయడం వల్ల దంత సంబంధిత సమస్యలు తగ్గు ముఖం పట్టడంతోపాటు నోటి దుర్వాసన కూడా తగ్గుతుంది.
మొలలను తగ్గించే శక్తి కూడా పసుపుకు ఉంది. మొలలను తగ్గించడంలో పసుపు దివ్యౌషధంగా పని చేస్తుంది. మొలలను నివారించుకోవడానికి గాను ముందుగా ఒక జార్ లో ఉల్లిపాయ ముక్కలను వేసి పేస్ట్ లా చేసి ఒక గిన్నెలోకి తీసుకోవాలి. తరువాత అందులో పసుపును, ఆవ నూనెను వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొలలపై రాయాలి. ఇలా క్రమం తప్పకుండా చేయడం వల్ల నొప్పి తగ్గడంతోపాటు మొలల నుండి కూడా ఉపశమనం కలుగుతుంది. ఎక్కువగా మద్యం సేవించే వారు రోజూ ఒక గ్లాస్ మజ్జిగలో ఒక టీ స్పూన్ పసుపును కలిపి తీసుకోవడం వల్ల కాలేయ ఆరోగ్యం దెబ్బతినకుండా ఉంటుంది.
అలాగే ఆముదంలో పసుపును కలిపి చర్మానికి రాసుకోవాలి. ఈ మిశ్రమం ఆరిన తరువాత స్నానం చేయాలి. ఇలా చేయడం వల్ల దురదలతోపాటు ఇతర చర్మ రోగాలు కూడా నయం అవుతాయి. శరీరంలో అధికంగా పేరుకుపోయిన కొవ్వును కూడా పసుపు కరిగించగలదు. దీనికోసం మనం పసుపుతో ఒక పానీయాన్ని తయారు చేసుకుని వాడాల్సి ఉంటుంది. ముందుగా ఒక గ్లాస్ వేడి నీటిలో పసుపును వేసి కలపాలి. తరువాత అందులో కొద్దిగా దాల్చిన చెక్క పొడిని, నిమ్మరసాన్ని, తేనెను వేసి బాగా కలపాలి. ఈ పానీయాన్ని రోజూ తాగడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు అదుపులో ఉంటాయి. అధిక బరువు తగ్గుతారు. రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కీళ్ల నొప్పులు తగ్గుతాయి.
ఈ పానీయాన్ని తాగడం వల్ల మలబద్దకం సమస్య తగ్గు ముఖం పడుతుంది. జీర్ణశక్తి మెరుగుపడుతుంది. దీనిని క్రమం తప్పకుండా రోజూ తాగడం వల్ల శరీరంలో రోగ నిరధక శక్తి బలపడుతుంది. దీంతో మనం ఇన్ ఫెక్షన్ ల బారిన పడకుండా ఉంటాం. ఈ విధంగా పసుపు మనకు అనేక విధాలుగా ఉపయోగపడుతుందని పసుపును వాడడం వల్ల మనం చక్కటి ఆరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.