Rajma Masala Curry : రాజ్మా.. ఇవి మనందరికీ తెలిసినవే. చూడడానికి మూత్రపిండాల ఆకారంలో ఎర్రగా ఉండే వీటిలో మన శరీరానికి అవసరమయ్యే ఎన్నో రకాల పోషకాలు ఉంటాయి. వీటిని ఆహారంలో భాగంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుందని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. రాజ్మాతో వివిధ రకాల వంటకాలను తయారు చేస్తూ ఉంటాం. రాజ్మాతో చేసుకోదగిన వంటకాల్లో రాజ్మా మసాలా కూర కూడా ఒకటి. రాజ్మా మసాలా కూర చాలారుచిగా ఉంటుంది. చాలా సులభంగా దీనిని మనం తయారు చేసుకోవచ్చు. రాజ్మాతో రుచిగా మసాలా కూరను ఎలా తయారు చేసుకోవాలి.. దీని తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రాజ్మా మసాలా కూర తయారీకి కావల్సిన పదార్థాలు..
రాజ్మా – అర కప్పు, నూనె – 4 టేబుల్ స్పూన్స్, లవంగాలు – 2, యాలకులు – 2, దాల్చిన చెక్క ముక్కలు – 2 , బిర్యానీ ఆకు – 1, జీలకర్ర – అర టీ స్పూన్, ఎండు మిర్చి – 1, చిన్నగా తరిగిన పచ్చి మిర్చి – 1, కచ్చా పచ్చాగా దంచిన ఉల్లిపాయలు – 2 (చిన్నవి), అల్లం వెల్లుల్లి పేస్ట్ – ఒక టీ స్పూన్, కారం – ఒకటిన్నర టీ స్పూన్ కారం, పసుపు – అర టీ స్పూన్, ధనియాల పొడి – ఒక టీ స్పూన్, జీలకర్ర పొడి – పావు టీ స్పూన్, ఉప్పు – తగినంత, టమాటాలు – 2, గరం మసాలా – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.
రాజ్మా మసాలా కూర తయారీ విధానం..
ముందుగా రాజ్మా గింజలను ఒక గిన్నెలో తీసుకుని తగినన్ని నీళ్లు పోసి 8 గంటల పాటు నానబెట్టాలి. ఇలా నానబెట్టిన తరువాత ఈ రాజ్మా గింజలను శుభ్రంగా కడిగి కుక్కర్ లో వేయాలి. కుక్కర్ లో 2 నుండి 3 కప్పుల నీళ్లు, పావు టీ స్పూన్ పసుపు, అర టీ స్పూన్ కారం, అర టీ స్పూన్ ఉప్పు వేసి మూత పెట్టి 6 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఒక జార్ లో టమాటాలను ముక్కలుగా కోసి వేసి మెత్తని ఫ్యూరీ అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు కళాయిలో నూనె వేసి నూనె వేడయ్యాక యాలకులు, దాల్చిన చెక్క, లవంగాలు, బిర్యానీ ఆకు, జీలకర్ర, ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఇవి వేగిన తరువాత పచ్చి మిర్చి ముక్కలు వేసి వేయించుకోవాలి.
తరువాత దంచిన ఉల్లిపాయ ముద్దను వేసి రంగు మారే వరకు వేయించాలి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. తరువాత పసుపు, కారం, ఉప్పు, ధనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలుపుతూ ఒక నిమిషం పాటు వేయించాలి. తరువాత టమాటా ఫ్యూరీని వేసి కలిపి నూనె పైకి తేలే వరకు వేయించాలి. ఇలా వేయించిన తరువాత ముందుగా ఉడికించిన రాజ్మా గింజలను నీళ్లతో సహా వేసి కలపాలి.
తరువాత కళాయిపై మూతను ఉంచి 10 నుండి 15 నిమిషాల పాటు మధ్యస్థ మంటపై ఉడికించాలి. తరువాత గరం మసాలాను వేసి ఒక నిమిషం పాటు ఉడికించాలి. చివరగా కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రాజ్మా మసాలా కూర తయారవుతుంది. దీనిని అన్నం, చపాతీ, పుల్కా, రోటీ, వెజ్ బిర్యానీ వంటి వాటితో కలిపి తింటే చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా రాజ్మాతో కూరను చేసుకుని తినడం వల్ల రుచితో పాటు రాజ్మాలో ఉండే పోషకాలను కూడా పొందవచ్చు. ఇలా చేసిన రాజ్మా కూరను అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.