Rasam Podi : మనం వంటింట్లో అప్పుడప్పుడు రసాన్ని తయారు చేస్తూ ఉంటాము. వేడి వేడిగా అన్నంలో రసం వేసుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. రసం తయారు చేసుకోవడానికి చాలా మంది ఇన్ స్టాంట్ రసం పొడిని వాడుతూ ఉంటారు. బయట మార్కెట్ లో లభించే ఇన్ స్టాంట్ రసం పొడిని ఎక్కువగా వాడుతూ ఉంటారు. అయితే బయట లభించే రసం పొడి వాసన తక్కువగా ఉండడంతో పాటు అంత రుచిగా కూడా ఉండదు. ఇలా బయట కొనడానికి బదులుగా మనం ఇంట్లోనే రసం పొడిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లో తయారు చేసిన ఈ రసం పొడితో చేసే రసం చాలా రుచిగా ఉంటుంది. మనం ఇంట్లో చాలా సులభంగా రసం పొడిని తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే ఇన్ స్టాంట్ రసం పొడిని ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసం పొడి తయారీకి కావల్సిన పదార్థాలు..
ధనియాలు – ఒక కప్పు, జీలకర్ర – పావు కప్పు, మిరియాలు – పావు కప్పు, కందిపప్పు – పావు కప్పుఎండుమిర్చి – పావు కప్పు, కరివేపాకు – పావు కప్పు.
రసం పొడి తయారీ విధానం..
ముందుగా కళాయిలో ధనియాలు వేసి చిన్న మంటపై దోరగా వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. తరువాత జీలకర్ర వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. అలాగే మిగిలిన పదార్థాలను కూడా ఒక్కొక్కటిగా వేసి వేయించి ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారిన తరువాత వీటిని జార్ లోకి మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరకగా ఉండేలా మిక్సీ పట్టుకోవాలి. ఈ పొడి చల్లారిన తరువాత గాజు సీసాలో వేసి నిల్వ చేసుకోవాలి. ఈ విధంగా చేయడం వల్ల రసం పొడి తయారవుతుంది. అలాగే ఈ పొడిని మిక్సీ పట్టుకునేటప్పుడే ఇందులో ఒక టీ స్పూన్ పసుపు, ఒక టీ స్పూన్ ఇంగువ వేసి మిక్సీ పట్టుకుని నిల్వ చేసుకోవచ్చు. ఈ విధంగా తయారు చేసిన రసం పొడితో చేసే రసం చాలా రుచిగా ఉంటుంది. ఈ విధంగా చాలా సులభంగా ఇంట్లోనే ఎక్కువ మొత్తంలో కూడా రసం పొడిని తయారు చేసుకోవచ్చు.