Sleep Direction : మన శరీరానికి నిద్ర చాలా అవసరం. రోజూ తగినంత నిద్ర పోవడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మేలు కలుగుతుంది. నిద్ర ఎలాగైతే మన శరీరానికి మేలు చేస్తుందో మనం నిద్రించే విధానం కూడా మన శరీరానికి మేలు చేస్తుంది. మనం సరైన భంగిమల్లో పడుకోవడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. సరైన భంగిమల్లో పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యల నుండి చక్కటి ఉపశమనం కలుగుతుంది. ఏయే భంగిమల్లో పడుకోవడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దూరమవుతాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఎటువంటి అనారోగ్య సమస్యలు లేని వారు శవాసనంలో పడుకోవడం మంచిది.
అలాగే నడుము నొప్పి, మెడనొప్పి, సయాటికా నొప్పితో బాధపడే వారు శవాసనంలో పడుకుని ఆ తరువాత మోకాళ్ల కింద దిండును ఉంచి నిద్ర పోవాలి. ఇక కాళ్లల్లో వాపులు, పాదాలల్లో వాపులు, వెరీకోన్స్ వెయిన్స్ వంటి సమస్యలతో బాధపడే వారు పాదాల కింద దిండును ఉంచి నిద్రపోవాలి. ఇలా చేయడం వల్ల వాపులు తగ్గుతాయి. అయితే ఊబకాయం, పొట్ట, అదిక బరువు సమస్యతో బాధపడే వారు శవాసనంలో పడుకోవద్దు. ఇలా ఊబకాయం, అధిక బరువుతో పడే వారు శవాసనంలో పడుకోవడం వల్ల వారిలో గురక ఎక్కువగా వస్తుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వారు ఎడమచేతి వైపు తిరిగి పడుకోవాలి. ఇలా పడుకోవడం వల్ల గురక రాకుండా ఉంటుంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. అలాగే ఇలా ఎడమచేతి వైపు తిరిగి పడుకోవడం వల్ల కాలేయంపై ఒత్తిడి పడకుండా ఉంటుంది.
అయితే గుండె సమస్యలు ఉన్న వారు మాత్రం ఎడమవైపు తిరిగి పడుకోవడం మంచిది కాదు. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల గుండెపై మరింతగా ఒత్తిడి పడుతుంది. కనుక గుండె సమస్యలు ఉన్న వారు తప్ప ఇతరులు ఎవరైనా ఎడమ వైపు తిరిగి పడుకోవచ్చు. ఇక గుండె సమస్యలు ఉన్న వారు కుడి చేతి వైపు తిరిగి పడుకోవడం మంచిది. ఇలా పడుకోవడం వల్ల గుండెపై ఒత్తిడి పడకుండా ఉంటుంది. ఇక మనలో చాలా మంది బోర్లా తిరిగి పడుకుంటారు. ఇలా పడుకోవడం మంచిదికాదని నిపుణులు చెబుతున్నారు. ఇలా పడుకోవడం వల్ల పొట్ట బరువంతా కూడా ఊపిరితిత్తుల మీద పడుతుంది. ఆయాసంఎక్కువగా వస్తుంది. ఆక్సిజన్ సరఫరా తగ్గుతుంది. అలాగే నడుము నొప్పి, మెడ నొప్పి వంటి సమస్యలతో బాధపడే పరుపుల మీద కంటే బొంతల మీద పడుకోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు. అలాగే దిండు కూడా 2 అంగుళాల కంట ఎక్కువ మందం లేకుండా చూసుకోవాలి. ఈ విధంగా తగిన భంగిమల్లో పడుకోవడం వల్ల అనారోగ్య సమస్యలు చాలా వరకు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.