Rasam Rice : మనం అన్నంతో రకరకాల రైస్ వెరైటీలను తయారు చేస్తూ ఉంటాం. రైస్ వెరైటీలు చాలా రుచిగా ఉండడంతో పాటు దీనిని తయారు చేయడం కూడా చాలా సులభం. మనం సులభంగా తయారు చేసుకోదగిన రైస్ వెరైటీలలో రసం రైస్ కూడా ఒకటి. రసం పొడి వేసి చేసే ఈ రైస్ వెరైటీ చాలా రుచిగా ఉంటుంది. మనకు రెస్టారెంట్ లలో ఈ వంటకం ఎక్కువగా లభిస్తూ ఉంటుంది. ఈ రైస్ రైస్ ను కమ్మగా, లొట్టలేసుకుంటూ తినేలా మనం ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. బ్యాచిలర్స్, వంటరాని వారు కూడా ఈ రసం రైస్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. రసం రైస్ ను కమ్మగా ఎలా తయారు చేసుకోవాలి.. తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రసం రైస్ తయారీకి కావల్సిన పదార్థాలు..
గంట పాటు నానబెట్టిన బియ్యం – ఒక కప్పు, పసుపు -పావు టీ స్పూన్, గంట పాటు నానబెట్టిన పెసరపప్పు – 2 టేబుల్ స్పూన్స్, గంట పాటు నానబెట్టిన కందిపప్పు – 2 టేబుల్ స్పూన్, పెద్ద ముక్కలుగా తరిగిన పెద్ద టమాట – 1, నీళ్లు – 4 కప్పులు, నానబెట్టిన చింతపండు – 50 గ్రా., రసం పొడి – ఒకటిన్నర టేబుల్ స్పూన్, ఉప్పు – తగినంత, తరిగిన కొత్తిమీర – కొద్దిగా.

తాళింపు తయారీకి కావల్సిన పదార్థాలు..
నెయ్యి – రెండు టేబుల్ స్పూన్స్, ఇంగువ – రెండు చిటికెలు, ఆవాలు – ఒక టీ స్పూన్, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఎండుమిర్చి – 2, తరిగిన పచ్చిమిర్చి – 2, కరివేపాకు – ఒక రెమ్మ.
రసం రైస్ తయారీ విధానం..
ముందుగా కుక్కర్ లో బియ్యం, పసుపు, పెసరపప్పు, కందిపప్పు, నీళ్లు పోసి మూత పెట్టాలి. ఇప్పుడు ఈ బియ్యాన్ని 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత కుక్కర్ మూత తీసి ఇందులో చింతపండు రసం, రసం పొడి, మరో రెండున్నర కప్పుల నీళ్లుమ పోసి కలుపుతూ అన్నాన్ని మెత్తగా చేసుకోవాలి. తరువాత ఈ కుక్కర్ ను స్టవ్ మీద ఉంచి అన్నాన్ని మధ్యస్థ మంటపై కలుపుతూ ఉడుకుపట్టించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు కళాయిలో నెయ్యి వేసి వేడి చేయాలి. నెయ్యి వేడయ్యాక తాళింపు పదార్థాలు ఒక్కొక్కటిగా వేసి వేయించాలి.
తాళింపు చక్కగా వేగిన తరువాత దీనిని రసం అన్నంలో వేసి కలపాలి. అలాగే పైన నుండి కొద్దిగా కొత్తిమీరను చల్లుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రసం రైస్ తయారవుతుంది. ఈ రైస్ చాలా రుచిగా ఉంటుంది. ఇంట్లో కూరగాయలు లేనప్పుడు, నోటికి రుచిగా తినాలనిపించినప్పుడు ఇలా రసం రైస్ ను తయారు చేసుకుని తినవచ్చు. ఈ రైస్ ను లొట్టలేసుకుంటూ అందరూ ఎంతో ఇష్టంగా తింటారు.