Rava Vada : మనం రవ్వతో రకరకాల చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాము. బొంబాయి రవ్వతో చేసే ఈ చిరుతిళ్లు రుచిగా ఉండడంతో పాటు చాలా సులభంగా, చాలా తక్కువ సమయంలో తయారు చేసుకోవచ్చు. రవ్వతో చేసుకోదగిన రుచికరమైన వంటకాల్లో రవ్వ వడలు కూడా ఒకటి. రవ్వ వడలు క్రిస్పీగా చాలా రుచిగా ఉంటాయి. అల్పాహారంగా లేదా స్నాక్స్ గా వీటిని తయారు చేసి తీసుకోవచ్చు. ఈ వడలను తయారు చేయడం చాలా సులభం. బయట క్రిస్పీగా, లోపల మెత్తగా ఉండే ఈ రవ్వ వడలను ఎలా తయారు చేసుకోవాలి..తయారీకి కావల్సిన పదార్థాలు ఏమిటి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ వడల తయారీకి కావల్సిన పదార్థాలు..
రవ్వ – ఒక కప్పు, జీలకర్ర – ఒక టీ స్పూన్, ఆవాలు – పావు టీ స్పూన్, క్యారెట్ తురుము – అర కప్పు, అల్లం తురుము – ఒక టీ స్పూన్, చిన్నగా తరిగిన పచ్చిమిర్చి – 2, పుల్లటి పెరుగు -తగినంత, ఉప్పు – తగినంత, వంటసోడా – పావు టీ స్పూన్, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ వడల తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత ఇందులో నూనె తప్ప మిగిలిన పదార్థాలన్నీ వేసి కలపాలి. తరువాత కొద్ది కొద్దిగా పెరుగును వేసుకుంటూ వడల పిండిలాగా గట్టిగా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూత పెట్టి 15 నిమిషాల పాటు నానబెట్టాలి. రవ్వ చక్కగా నానిన తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక కొద్ది కొద్దిగా రవ్వ మిశ్రమాన్ని తీసుకుంటూ వడల ఆకారంలో వత్తుకుని నూనెలో వేసుకోవాలి. ఈ వడలను మధ్యస్థ మంటపై రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ వడలు తయారవుతాయి. వీటిని కొబ్బరి చట్నీ, అల్లం చట్నీ వంటి వాటితో తింటే చాలా రుచిగా ఉంటాయి. చల్లటి వాతావరణంలో వేడి వేడిగా ఇలా రవ్వ వడలను తయారు చేసుకుని తింటే చాలా చక్కగా ఉంటుంది.