Ravva Appalu : రవ్వను కూడా మనం ఆహారంగా తీసుకుంటూ ఉంటాం. రవ్వతో కేవలం ఉప్మానే కాకుండా చిరుతిళ్లను, తీపి పదార్థాలను తయారు చేస్తూ ఉంటాం. రవవ్వతో చేసుకోదగిన తీపి పదార్థాల్లో రవ్వ అప్పాలు కూడా ఒకటి. ఇవి చాలా రుచిగా ఉంటాయి. వీటిని తక్కువ సమయంలో చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. చక్కటి రుచిని కలిగి ఉండే ఈ రవ్వ అప్పాలను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ అప్పాలు తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పంచదార – ఒక కప్పు, యాలకుల పొడి – ఒక టీ స్పూన్, నీళ్లు – ఒక కప్పు, నూనె – డీప్ ఫ్రైకు సరిపడా.
రవ్వ అప్పాలు తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో బొంబాయి రవ్వను తీసుకోవాలి. తరువాత అందులో పంచదార, యాలకుల పొడి వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. తరువాత ఒక కళాయిలో నీళ్లు పోసి వేడి చేయాలి. నీళ్లు బాగా మరిగిన తరువాత కలిపి పెట్టుకున్న రవ్వను కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి మధ్య మధ్యలో కలుపుతూ రవ్వను దగ్గర పడే వరకు ఉడికించాలి. తరువాత ఈ రవ్వను పూర్తిగా చల్లారే వరకు ఉంచాలి. రవ్వ చల్లారిన తరువాత చేత్తో బాగా కలపాలి. తరువాత చేతికి నెయ్యి రాసుకుంటూ ఉండలు చేసుకుని అప్పాలుగా వత్తుకోవాలి. ఇలా అప్పాలను వత్తుకున్న తరువాత కళాయిలో నూనె పోసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక అప్పాలను వేసి కాల్చుకోవాలి.
అప్పాలు మెత్తగా ఉంటాయి కనుక నూనెలో వేసిన వెంటనే గంటెతో కదపకూడదు. అవి కొద్దిగా కాలిన తరువాత అటూ ఇటూ తిప్పుతూ ఎర్రగా అయ్యే వరకు కాల్చుకోవాలి. తరువాత ఒక్కో రవ్వ అప్పను తీసుకుంటూ రెండు గంటెల సహాయంతో అరిసెలను వత్తుకున్నట్టు వాటిలో ఎక్కువగా ఉండే నూనెను వత్తుకోవాలి. ఇలా వత్తుకున్న తరువాత వీటిని టిష్యూ పేపర్ ఉంచిన గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రవ్వ అప్పాలు తయారవుతాయి. వీటిని గాలి తగలకుండా నిల్వ చేసుకోవడం వల్ల 3 రోజుల వరకు తాజాగా ఉంటాయి. రవ్వ అప్పాలు వేడిగా ఉన్నప్పుడు మెత్తగా ఉన్నా చల్లారే కొద్ది గట్టిగా అవుతాయి. తీపి తినాలనిపించినప్పుడు ఇలా రవ్వతో అప్పాలను చేసుకుని తినవచ్చు. ఈ రవ్వ అప్పాలను దేవుడికి నైవేథ్యంగా కూడా సమర్పించవచ్చు.