Ravva Breakfast : రవ్వతో మనం రకరకాల అల్పాహారాలను, చిరుతిళ్లను తయారు చేస్తూ ఉంటాం. రవ్వతో చేసే ఏ వంటకమైనా చాలా రుచిగా ఉంటుంది. రవ్వతో చాలా సులభంగా ఉండేలా ఒక వంటకాన్ని తయారు చేసుకుని అల్పాహారంగా తీసుకోవచ్చు. ఒక్కసారి దీనిని తింటే మళ్లీ మళ్లీ ఇదే కావాలని అడిగి మరీ తింటారు. అంత రుచిగా ఈ వంటకం ఉంటుంది. దీనిని తయారు చేయడానికి ఎక్కువగా నూనెను కూడా ఉపయోగించాల్సిన అవసరం లేదు. అల్పాహారంగా ఏం చేయాలో తోచనప్పుడు రవ్వతో ఈ వంటకాన్ని తయారు చేసుకోవచ్చు. రవ్వతో అల్పాహారంలో భాగంగా ఈ వంటకాన్ని ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
రవ్వ బ్రేక్ ఫాస్ట్ తయారీకి కావల్సిన పదార్థాలు..
బొంబాయి రవ్వ – ఒక కప్పు, పెరుగు – అర కప్పు, నీళ్లు – అర కప్పు, నూనె – 3 టీ స్పూన్స్, జీలకర్ర – పావు టీ స్పూన్, చిన్నగా తరిగిన ఉల్లిపాయ – 1, ఉప్పు – తగినంత, మిరియాల పొడి – పావు టీ స్పూన్, తరిగిన కొత్తిమీర – కొద్దిగా, తరిగిన కరివేపాకు – కొద్దిగా, ఉడికించిన బఠాణీ – 3 టేబుల్ స్పూన్, ఉడికించిన బీన్స్ – 3 టేబుల్ స్పూన్, కారం – అర టీ స్పూన్, పసుపు – పావు టీ స్పూన్, ధనియాల పొడి – పావు టీ స్పూన్, చాట్ మసాలా – పావు టీ స్పూన్, ఉడికించిన బంగాళాదుంపలు -3, క్యారెట్ తురుము – ఒక కప్పు, నిమ్మరసం – ఒక టేబుల్ స్పూన్.

రవ్వ బ్రేక్ ఫాస్ట్ తయారీ విధానం..
ముందుగా ఒక గిన్నెలో రవ్వను తీసుకోవాలి. తరువాత దీనిలో పెరుగును వేసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తరువాత నీళ్లు పోసి కలుపుకోవాలి. తరువాత దీనిపై మూతను ఉంచి 15 నిమిషాల పాటు పక్కకు ఉంచాలి. తరువాత ఈ మిశ్రమాన్ని జార్ లోకి తీసుకుని తగినన్ని నీళ్లు పోసుకుంటూ మెత్తగా మిక్సీ పట్టుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇలా రవ్వ అంతా మిక్సీ పట్టుకున్న తరువాత ఈ పిండిలో ఉప్పు, మిరియాల పొడి, తరిగిన కొత్తిమీర, కరివేపాకు వేసి కలిపి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక కళాయిలో నూనె వేసి వేడి చేయాలి. నూనె వేడయ్యాక జీలకర్ర వేసి వేయించాలి.
తరువాత ఉల్లిపాయ ముక్కలు వేసి కలపాలి. ఉల్లిపాయ వేగిన తరువాత ఉడికించిన బఠాణీ, బీన్స్ వేసి కలపాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, కరివేపాకు, ధనియాల పొడి, చాట్ మసాలా వేసి కలిపి నిమిషం పాటే వేయించాలి. తరువాత ఉడికించిన బంగాళాదుంపను మెత్తగా చేసుకుని వేసుకోవాలి. దీనిని అంతా కలిసేలా బాగా కలుపుకుని రెండు నిమిషాల పాటు కలుపుకోవాలి. తరువాత క్యారెట్ తురుము వేసి కలిపి మరో 5 నిమిషాల పాటు వేయించి కొత్తిమీరను చల్లి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద పెన్నాన్ని ఉంచి వేడి చేయాలి. నూనె వేడయ్యాక ముందుగా తయారు చేసుకున్న పిండిని గంటెతో తీసుకుని దోశలా వేసుకోవాలి. దీనిపై కొద్దిగా నూనె వేసి ఒక నిమిషం పాటు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి.
ఇలా అన్ని దోశలను కాల్చుకున్న తరువాత ఒక్కో దోశను తీసుకుని దాని మధ్యలో ముందుగా తయారు చేసుకున్న బంగాళాదుంప మిశ్రమాన్ని ఉంచి చతురస్రాకారంలో అన్ని అంచులను మూసి వేయాలి. ఇలా అన్నింటిని తయారు చేసుకున్న తరువాత పెనం మీద ఒక టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి. పెనం వేడయ్యాక ఇలా తయారు చేసుకున్న వాటిని రెండు వైపులా ఎర్రగా అయ్యే వరకు కాల్చుకుని ప్లేట్ లోకి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రవ్వ బ్రేక్ ఫాస్ట్ తయారవుతుంది. దీనిని చాలా తక్కువ నూనెను ఉపయోగించి తయారు చేసుకుంటున్నాము కనుక వీటిని తినడం వల్ల రుచితో పాటు ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. తరచూ దోశ, ఇడ్లీ వంటి వాటినే కాకుండా రవ్వతో ఇలా కూడా తయారు చేసుకుని తినవచ్చు.