Rose Milk : రోజ్ మిల్క్.. దీనినిచాలా మంది ఇష్టంగా తాగుతారు. మనకు వేసవికాలంలో జ్యూస్ సెంటర్లలో, ఐస్ క్రీమ్ షాపుల్లో ఇది విరివిరిగా లభిస్తుంది. ఈ రోజ్ మిల్క్ ను రోజ్ సిరప్ తో తయారు చేస్తారన్న సంగతి మనకు తెలిసిందే. ఈ రోజ్ సిరప్ మనకు బయట షాపుల్లో విరివిరిగా లభిస్తుంది. అయితే ఈ రోజ్ సిరప్ ను తయారు చేయడానికి రంగులను, ఫ్రిజర్వేటివ్స్ ను వాడుతూ ఉంటారు. దీని వల్ల రోజ్ సిరప్ కలర్ ఫుల్ గా కనబడడంతో పాటు ఎక్కువ కాలం పాటు నిల్వ కూడా ఉంటుంది. అయితే ఎటువంటి ఫ్రిజర్వేటివ్స్, రంగులు వాడకుండా కూడా మనం రోజ్ సిరప్ ను ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. ఇంట్లోనే చక్కటి రంగుతో ఉండే రోజ్ సిరప్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అలాగే దీనితో రోజ్ మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలి.. అన్న వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
రోజ్ సిరప్ తయారీకి కావల్సిన పదార్థాలు..
దేశవాలీ గులాబీలు – 50 గ్రాములు, పటిక బెల్లం – ఒక కప్పు, నీళ్లు – ఒక కప్పు, రోజ్ ఎసెన్స్ – ఒక టీ స్పూన్, బీట్ రూట్ – 1, రోజ్ వాటర్ – ఒక టీ స్పూన్, కాచి చల్లార్చిన పాలు – ఒక కప్పు.
రోజ్ సిరప్ తయారీ విధానం..
ముందుగా గులాబి రేకులను పూల నుండి వేరు చేసి శుభ్రంగా కడగాలి.తరువాత వీటిని కాటన్ వస్త్రంపై వేసి ఫ్యాన్ కింద ఉంచి పూర్తిగా ఎండే వరకు ఆరబెట్టాలి. తరువాత ఒక గిన్నెలో పటిక బెల్లం, నీళ్లు, బీట్ రూట్ తురుము వేసి మరిగించాలి. ఇలా 8 నిమిషాల పాటు మరిగించిన తరువాత ఎండబెట్టిన గులాబి రేకులను ఒక కప్పు మోతాదులో వేసుకోవాలి. తరువాత రోజ్ ఎసెన్స్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని చిక్కబడే వరకు మరిగించి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. తరువాత దీనిని వడకట్టి సీసాలో పోసి ఫ్రిజ్ లో ఉంచి నిల్వ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల చక్కటి రంగుతో ఉండే రోజ్ సిరప్ తయారవుతుంది.
దీనితో రోజ్ మిల్క్ ను ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం. దీని కోసం ఒక గ్లాస్ లో 5 లేదా 6 ఐస్ క్యూబ్స్ ను తీసుకోవాలి. తరువాత ఇందులో 5 టీస్పూన్ల రోజ్ సిరప్ ను వేసుకోవాలి. తరువాత రోజ్ వాటర్ ను వేసుకోవాలి. ఇప్పుడు చిక్కగా అయ్యే వరకు మరిగించిన పాలను పోసి కలిపి సర్వ్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఎంతో రుచిగా ఉండే రోజ్ మిల్క్ తయారవుతుంది. దీనిని తాగడం వల్ల రుచితో పాటు ఆరోగ్యానికి కూడా మేలు కలుగుతుంది.